టోక్యో: బెర్ముడా దేశ జనాభా సుమారు 64 వేలు. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యవేక్షణలో ఉన్న అతి చిన్న దేశం. అక్కడి ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగారు. 1936 నుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి తమ దేశం తరఫున ఆ జట్టు ఒలింపిక్స్‌కు జట్టును పంపిస్తోంది. ఇప్పుడు మొదటిసారి ఒక స్వర్ణపతకం బెర్ముడా ఖాతాలో చేరింది. 33 ఏళ్ల ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ ఆ కలను నిజం చేసి చూపించింది. ఫలితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన అతి చిన్న దేశంగా బెర్ముడా గుర్తింపు పొందింది. టోక్యోలో ఆ దేశం తరఫున డఫీతోపాటు అలీజదె దారా (రోయింగ్) మాత్రమే బరిలోకి దిగారు. గతంలో ఆ దేశం ఖాతాలో ఒకే ఒక కాంస్యం ఉంది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పురుషుల బాక్సింగ్‌లో క్లారెన్స్ హిల్ ఈ ఘనత సాధించాడు. ఇన్నేళ్లకు బెర్ముడాకు స్వర్ణంతో ఆనందం దక్కింది. రేసును గంటా 55 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి డఫీ మొదటి స్థానంలో నిలిచింది.
కఠోర శ్రమతో...
1500 మీటర్ల స్విమ్మింగ్... 40 కిలోమీటర్ల సైక్లింగ్... 10 కిలోమీటర్ల పరుగు... ఈ మూడూ ఒలింపిక్ ట్రయాథ్లాన్‌లో భాగం. ఒకటి తర్వాత మరొకటి వరుసగా పూర్తి చేయాల్సిన కఠినమైన ఈవెంట్ ఇది. ఎంతో ఫిట్‌నెస్, పట్టుదల ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. డఫీ తొలిసారి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొని రేస్ కూడా పూర్తి చేయలేకపోయింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 45వ స్థానంలో నిలిచింది. దీనికి తోడు కెరీర్‌లో వరుస గాయాలు. ఒకదశలో ఒకదాని వెంట మరొకటి దాదాపు పది రకాల భిన్నమైన గాయాలతో ఆమె బాధపడింది. వీటికి తోడు ఎనీమియా బారిన కూడా పడింది. దాంతో విసుగెత్తి ఏడాది పాటు ఆటకు గుడ్‌బై చెప్పేసి చదువుపై దృష్టి పెట్టింది. అయితే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పునరాగమనం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఈసారి 8వ స్థానం. వరల్డ్ ట్రయాథ్లాన్ సిరీస్‌లలో గెలుస్తున్నా... అసలు లక్ష్యం మాత్రం ఒలింపిక్ పతకమే. దీని కోసం ఎంతో కష్టపడిన డఫీ ఇప్పుడు సగర్వంగా విజేతగా నిలిచింది. వేదికపై బెర్ముడా జాతీయ గీతం వినిస్తుండగా ఆమె కంట ఆనందబాష్పాలు కనిపించాయి!
Comments
Please login to add a commentAdd a comment