అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి’
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలకు తక్షణమే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి కోరారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగ నియామకాల్లో కూడా నిరుపేద ఓసీలకు రిజర్వేషన్లు వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఏపీలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు.. మిగతా 5 శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణంలోని పేదలకు ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రకటించారని పేర్కొన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలతో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని మండిపడ్డారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలు కోసం త్వరలో లక్నో, జైపూర్, బెంగళూరు, భోపాల్‌లలో జాతీయ చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు డి.సుదర్శనరెడ్డి, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, సూర్యకుమార్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.