అక్టోబరు 16న వైఎస్ఆర్సీపీ ధర్నాలు
విజయనగరం మున్సిపాలిటీ: రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ అక్టోబరు 16న జిల్లాలోని 34 మండలాల తహశీల్దార్ల కార్యాలయూల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు చేయనున్న ధర్నాలో ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పారు. పార్టీ జిల్లా విస్తృత స్థారుు సమావేశం ఈ నెల 26న ఉదయం పది గంటలకు పట్టణ శివారులోని గొట్లాం ఆర్కే టౌన్షిప్ ఆవరణలో నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు.
పార్టీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు నేతృత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే పార్టీలో ఉత్సాహంగా పని చేస్తున్న నాయకులు,కార్యకర్తలకు గ్రామ, బూత్ స్థారుు కమిటీల్లో స్థానం కల్పించనున్నట్టు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంపై కోలగట్ల విమర్శల వర్షం కురిపించారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీని, బెల్టు షాపుల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణ నిలుపుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇదే విషయమై బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రశ్నిస్తే ఉనికిని చాటుకునేందుకేనని టీడీపీ అర్ధరహితమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సంక్షేమం, అభివృద్ధి వ్యవహరాలను సమపాలల్లో సమర్ధంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం కేవలం ప్రకటనలకు పరిమితం కావడం అర్ధరహితమన్నారు. ఇందుకు ప్రభుత్వమే ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు : పెనుమత్స
పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ జిల్లా స్థారుు విస్తృత సమావేశం అనంతరం అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. చంద్రబాబు ఎన్నికల నాటి హామీలను విస్మరించి మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు అవనాపు విజయ్, కేవీవీ సూర్యనారాయణరాజు, చనుమళ్ల వెంకటరమణ, ఎస్వీవీ రాజేష్, ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు.