భావన పెళ్లికి ముహూర్తం కుదిరింది
తమిళసినిమా: నటి భావన పెళ్లి తేదీ ఖారరైంది. ఇటీవల తన కారు డ్రైవర్ సహా కొందరు ఆమెపై లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్ర వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. అయితే భావన డ్రైవర్ సహా మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి. కాగా ఆ తరువాత కొన్ని వారాలకే తన ప్రేమికుడు నవీన్‌తో నటి భావనకు వివాహ నిశ్చితార్థం జరిగింది. అప్పుడు పెళ్లి ఎప్పుడన్నది నిర్ణయం కాలేదు. తాజాగా భావన వివాహ ముహూర్తం తేదీ ఖారారైంది.
అక్టోబర్ 27న నటి భావన, నవీన్‌ల పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని నటి భావన తల్లి పుష్ప వెల్లడించారు. దీని గురించి ఆమె తెలుపుతూ భావన పెళ్లి తమ సొంత ఊరు తిరుచ్చూరిలో జరగనుందన్నారు. అయితే పెద్దగా ఆర్భాటాలేమీ లేకుండా నిరాడంబరంగా పెళ్లి తంతు నిర్వహించనున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానించాలన్నది భావననే నిర్ణయించుకుంటుందన్నారు. ప్రస్తుతం తను స్విట్జర్లాండ్ వెళ్లిందని, అక్కడ నుంచి రాగానే ఎవరిని ఆహ్వానించాలన్నది నిర్ణయించుకుంటుందని చెప్పారు.