october month
-
స్మాల్ బ్రేక్ కావాలి గురూ!
నటననే వృత్తి చాలా సులభమనే అభిప్రాయం చాలా మందికి ఉంటోంది. దిగితే గాని లోతు తెలియదన్నట్టు అన్ని వృత్తుల్లోలాగానే ఇందులోనూ సాదక బాధకాలు ఎన్నో ఉంటాయన్న విషయం తక్కువ మందికే తెలుస్తుంది. నిత్యం స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే మాటలు వింటూ, ముఖాలు మాడే లైటింగ్‌లో నటిస్తూ టేక్ ఒన్, టేక్ టు అంటూ విసిగిపోకుండా నటించడం అంత ఆషామాషీ కాదు. ప్రముఖ తారలైతే బిజీ షెడ్యూల్‌తో ఎడతెరపి లేకుండా నటిచేస్తుంటారు. అలాంటి వారు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం సహజం. అది అవసరం కూడా. అలాగే నటి తమన్న నెలరోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారట. చాలామంది నటీనటులు వేసవి సమయాల్లో ఊటీ లాంటి శీతల ప్రాంతాల్లో విహార యాత్రలు చేస్తుంటారు. నటి తమన్న మాత్రం అక్టోబర్ నెలను విశ్రాంతి దినాలుగా ప్రకటించేశారు. ఈ మధ్య తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడిపిన తమన్నకు కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే సమయం లేకపోయిందట. బంధుమిత్రుల శుభ కార్యాల్లోనూ పాల్గొనలేకపోయారట. దీంతో ఈ బ్యూటీ ఈ నెలంతా తన కుటుంబ సభ్యులతో గడిపేయాలనే నిర్ణయానికి వచ్చిందట. బంధువులను ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేయడం, వాళ్ల ఇళ్లకు వెళ్లి గడపడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనననున్నారట. అలాగే మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనల్లో మాత్రం నటిస్తారట. మళ్లీ నవంబర్లోనే సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. -
అతివృష్టి మండలాల ప్రకటన
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఏడాది అక్టోబర్ నెలలో అధిక వర్షాలు పడటంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాల నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం అందుకు స్పందించి 41 మండలాల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి గురువారం రాత్రి ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. జిల్లాలోని అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, బి.మఠం, గోపవరం, కలసపాడు, రాజంపేట, నందలూరు, కాశినాయన, సిద్దవటం, ఒంటిమిట్ట, చాపాడు, దువ్వూరు, జమ్మలమడుగు, కొండాపురం, లింగాల, ముద్దనూరు, మైదుకూరు, మైలవరం, పెద్దముడియం, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజుపాలెం, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లె, వేముల, చింతకొమ్మదిన్నె, చక్రాయపేట, చెన్నూరు, కడప, గాలివీడు, కమలాపురం, ఖాజీపేట, పెండ్లిమర్రి, వల్లూరు, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, రామాపురం, సుండుపల్లె, చిన్నమండెం మండలాల్లో అధిక వర్షాలు కురవడంతో జొన్న, మినుము, పత్తి, పెసర, వేరుశనగ, సజ్జ, కొర్ర, వరి, పొద్దుతిరుగుడు, సోయాబీన్స్, కంది, మొక్కజొన్న, నువ్వులు, చెరకు పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికలు పంపారు. వాటి ఆధారంగా ప్రభుత్వం స్పందించి ఆయా మండలాలు అధిక వర్షాలకు గురై పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. ఆయా మండలాల్లో రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను రీ షెడ్యూలు చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.