స్మాల్ బ్రేక్ కావాలి గురూ!
నటననే వృత్తి చాలా సులభమనే అభిప్రాయం చాలా మందికి ఉంటోంది. దిగితే గాని లోతు తెలియదన్నట్టు అన్ని వృత్తుల్లోలాగానే ఇందులోనూ సాదక బాధకాలు ఎన్నో ఉంటాయన్న విషయం తక్కువ మందికే తెలుస్తుంది. నిత్యం స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే మాటలు వింటూ, ముఖాలు మాడే లైటింగ్‌లో నటిస్తూ టేక్ ఒన్, టేక్ టు అంటూ విసిగిపోకుండా నటించడం అంత ఆషామాషీ కాదు. ప్రముఖ తారలైతే బిజీ షెడ్యూల్‌తో ఎడతెరపి లేకుండా నటిచేస్తుంటారు. అలాంటి వారు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం సహజం. అది అవసరం కూడా. అలాగే నటి తమన్న నెలరోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారట.
చాలామంది నటీనటులు వేసవి సమయాల్లో ఊటీ లాంటి శీతల ప్రాంతాల్లో విహార యాత్రలు చేస్తుంటారు. నటి తమన్న మాత్రం అక్టోబర్ నెలను విశ్రాంతి దినాలుగా ప్రకటించేశారు. ఈ మధ్య తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడిపిన తమన్నకు కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే సమయం లేకపోయిందట. బంధుమిత్రుల శుభ కార్యాల్లోనూ పాల్గొనలేకపోయారట. దీంతో ఈ బ్యూటీ ఈ నెలంతా తన కుటుంబ సభ్యులతో గడిపేయాలనే నిర్ణయానికి వచ్చిందట. బంధువులను ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేయడం, వాళ్ల ఇళ్లకు వెళ్లి గడపడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనననున్నారట. అలాగే మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనల్లో మాత్రం నటిస్తారట. మళ్లీ నవంబర్‌లోనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.