దిశ మళ్లనున్న వాయుగుండం!
ఒడిశా, బెంగాల్ వైపు పయనమవుతుందంటున్న ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది గురువారానికి వాయుగుండంగా బలపడే వీలుంది. అయితే ఈ వాయుగుండం ముందుగా అంచనా వేసినట్టుగా కాకుండా వాయవ్య దిశగా పయనించనుంది. దీంతో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పైగాక ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లపై ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
ఐఎండీ తొలుత వేసిన అంచనాల ప్రకారం.. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారాక కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే అది అనూహ్యంగా దిశ మార్చుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు వాయు‘గండం’ తప్పినట్టేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులపాటు కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగాను, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.