'పండా అరెస్ట్ పెద్ద నాటకం'
భువనేశ్వర్: మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్ట్ పెద్ద నాటకమని నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పండా అరెస్ట్ ఓ భాగమని ఆ పార్టీ అభివర్ణించింది. మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని విమర్శించింది. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అజయ్ ఈ మేరకు ఓ లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. పార్టీ నుంచి పండాను రెండేళ్ల క్రితమే బహిష్కరించినట్లు తెలిపారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులు, ప్రభుత్వానికి చేరవేస్తున్నారనే అభియోగాలు వెల్లువెత్తిన నేపథ్యంలో పండాను బహిష్కరించిన సంగతిని అజయ్ ఈ సందర్భంగా లేఖలో వివరించారు.
ఈ నెల 18వ తేదీన బరంపురం పట్టణంలో పండాను అరెస్ట్ చేసినట్లు ఒడిశా పోలీసులు ప్రకటించారు. అనంతరం ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పండాకు 10 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పండాపై నయాగఢ్, ఆర్ ఉదయ్గిరిలో ఆయుధాలు లూటీ, స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఇటాలియన్ జాతీయులు కిడ్నాప్ కేసులతోపాటు పలు కేసులలో పండా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పండాను పోలీసులు అరెస్ట్ చేసిన ప్రకటనపై మావోయిస్టు పార్టీపై విధంగా స్పందించింది.