నేటి సివిల్స్ పరీక్షకు సర్వం సిద్ధం
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జరగనున్న ఈ పరీక్ష కోసం నగరంలో మొత్తం 83 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అంధ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సైఫాబాద్‌లోని యూనివర్సిటీ సైన్స్ కళాశాలను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ షీట్లో వివరాలను నింపడంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే ఇన్విజిలేటర్ల సహకారం తీసుకోవచ్చు. నగరంలో ఆదివారం జరగనున్న సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 240 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా జరగనున్న పరీక్షలకు అనుగుణంగా బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు. ఈ బస్సులకు ‘సివిల్స్ స్పెషల్’ అనే బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్, ఉప్పల్, రామకృష్ణాపురం, కోఠి, శిల్పారామం, ఎల్బీనగర్, మిధాని తదితర మార్గాల్లో, ఈసీఐఎల్ నుంచి అఫ్జల్‌గంజ్, జీడిమెట్ల-కోఠి, మెహదీపట్నం-చార్మినార్, గోల్కొండ-చార్మినార్, కాచిగూడ-అపురూపకాలనీ, హిమాయత్‌సాగర్-కోఠి, ఉప్పల్-మెహదీపట్నం, ఎల్బీనగర్-మెహదీపట్నం, దిల్సుఖ్నగర్-పటాన్చెరు తదితర మార్గాల్లో ఈ బస్సులు నడుస్తాయి.
వివరాలు ఇలా..
పరీక్షా కేంద్రాలు: 83
మొత్తం అభ్యర్థులు: 38,798
అంధ అభ్యర్థులు: 146
జోనల్ అధికారులు: 44
సూపర్వైజర్లు: 44
ఇన్విజిలేటర్లు: 2,250
పరీక్ష సమయం..
పేపర్-1 ఉ.9.30- మ.12.30
పేపర్-2 మ.2.30-సా.4.30
ప్రత్యేక బస్సులు: 240