officers meeting
-
కీలకమైన సమావేశంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన డీఆర్వో మలోలా
-
50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడే కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. ఈనెల 13న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా.. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది. -
ప్రాజెక్టు పరిధిలో చేపల సంచారంపై పరిశీలన
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గోదావరి నదిలో చేపల సంచారానికి ఇబ్బందులు లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రాజెక్టు ఇంజినీరింగ్, మత్స్యశాఖ అధికారులు బుధవారం సాంకేతికంగా పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ అతిథి గృహంలో సమావేశం నిర్వహించి, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ బాషా మాట్లాడుతూ కొన్ని రకాల చేపలు కాలువల నుంచి నదిలోకి మైగ్రేషన్ ఉంటుందన్నారు. ఏ నెలల్లో ఏఏ రకాల చేపలు అందుబాటులో ఉంటాయి? సంచరిస్తాయి? అనేది ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. చేపల సంచారానికి వీలుగా స్పిల్‌వేలో ఎక్కడ డిజైన్ చేయాలనేది ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో చర్చించటం జరిగిందన్నారు. స్పిల్‌వే ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్నారు. స్పిల్‌వే 1, 2 బ్లాక్‌ల మధ్య చేపల సంచారానికి వీలుగా ఏర్పాట్లు చేయటంపై ఇంజినీరింగ్ అధికారులు చర్చించారన్నారు. ప్రధానంగా బొచ్చె, శీలావతి, మోసు, గండుమేను, ఇసుకదొందులు, జెల్ల, పులస, వాలుగు, కొర్ర మేను, రొయ్యలు, బొమ్మిడాయి జాతులు ఉంటాయన్నారు. సైజును బట్టి అవి ప్రయాణం చేస్తాయన్నారు. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వి.సురేష్, డాక్టర్ మాన్సన్, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీలు పి.రామ్మోహన్, డి.గోపిరెడ్డి, పోలవరం అథారిటీ సీఈ ఎ.పరమేశ్వరన్, ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్.రమేష్‌బాబు సమావేశంలో పాల్గొన్నారు. -
అధికార పార్టీ ఎమ్మెల్యే బరితెగింపు
► అధికారులూ.. సిగ్గు.. సిగ్గు ► టీడీపీ జిల్లా కార్యాలయంలో అధికారులతో సమీక్షలు ► కమిషనర్‌తో సహా కొందరు జిల్లా అధికారులు హాజరు ► ఆదేశించగానే పరుగులు పెడుతున్న యంత్రాంగం ► దామచర్ల తీరుపై సొంత పార్టీ నేతలు, అధికారుల విమర్శలు ఒంగోలు : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల వ్యవహారం. కేవలం ఒంగోలు ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ తన హోదాకు మించి అధికారం చలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తరచూ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ కమిషనర్‌తో సహా జిల్లా స్థాయి అధికారులను టీడీపీ జిల్లా కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. కాదు కూడదంటూ ఇక్కడ నుంచే హెచ్చరికలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై అటు సొంత పార్టీ నేతలు ఇటు అధికార వర్గాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంగోలు నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఆనవాయితీగా మారింది. తాజాగా సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ డీడీ, మున్సిపల్ ఇంజినీర్, మరికొందరు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదేశించటమే తడవుగా అధికారులు టీడీపీ కార్యాలయానికి పరుగులు పెట్టారు. మూడు గంటల పాటు ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా అధికారులు చేయాల్సిన పనుల చిట్టాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారుల ముందుంచారు. జీ హుజూర్ అంటూ అన్నింటికీ తల ఊపి అధికారులు వెనుతిరిగారు. స్వామి భక్తిని చాటుతున్న అధికారులు.. ఇటీవల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం మంత్రి, ఇన్చార్జి మంత్రి ఉత్తర్వుల కంటే ఎమ్మెల్యే దామచర్ల ఉత్తర్వులకే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పార్టీ కార్యాలయానికి అర్థరాత్రి రమ్మన్నా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ అధికార కార్యక్రమాల వేదికలపైనా అసలు విషయాలను వదిలిపెట్టి కొందరు అధికారులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచేత్తి స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఇటీవల కొత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒక జిల్లా స్థాయి రెవెన్యూ అధికారి ఎమ్మెల్యే పుణ్యంతోనే తాను జిల్లాకు అధికారిగా వచ్చానని బహిరంగంగానే ప్రకటించారు. దీన్ని చూస్తే అధికారుల దిగజారుడు తనం తేటతెల్లమవుతోంది. ఎమ్మెల్యే సీఎం సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతోనే కొందరు అధికారులు ఆయనకు గులాములుగా మారుతున్నారన్న ప్రచారం ఉంది. ఎంత స్వామి భక్తి ఉన్నా... జిల్లా స్థాయి అధికారులు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నిర్వహించే సమీక్షలకు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులే పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారని ఓ జిల్లా స్థాయి అధికారి పేర్కొన్నారు. అధికారులను పార్టీ కార్యాలయానికి సమీక్షలకు పిలిపించటం సరైంది కాదని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పేర్కొనడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఏనాడూ అధికారుల స్థాయిని దిగజార్చలేదని, నిబంధనల మేరకు మంత్రి కలెక్టర్ కార్యాలయం లేదా తాను విడిది చేసే ప్రభుత్వ అతిథి గృహాల్లోనే సమీక్షలు నిర్వహించారని మరో అధికార పార్టీ నేత పేర్కొన్నారు. ఎమ్మెల్యే తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందని, ముఖ్యంగా అధికారుల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని సొంత పార్టీకి చెందిన మరో నేత విమర్శించారు. మొత్తంగా ఎమ్మెల్యే దామచర్ల పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు పెట్టడంపై అటు కొందరు ఉన్నతాధికారులు, ఇటు టీడీపీ ముఖ్యనేతలు విమర్శించడం గమనార్హం. -
సమీక్షకు రాకపోతే బ్యాంకర్లపై కేసులు
ఏలూరు (మెట్రో): జిల్లాలో మీటింగ్‌కు పిలిస్తే రాకపోతే ఎలా? పేదలు, కౌలు రైతులకు రుణాలివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్ల తీరును సహించబోమని, మండల స్థాయిలో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్లకు బ్యాంకు అధికారులు ఇకపై రాకపోతే పోలీస్ కేసు తప్పదని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో బుధవారం ప్రాధాన్యతా రంగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016–17లో ప్రాధాన్యతా రంగాలకు రూ.12,775 కోట్లు రుణాలు ఇస్తామన్నారు. ఖరీఫ్ పంట కాలంలో కౌలు రైతులకు రుణాలివ్వకుండా బ్యాంకర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఏ బ్యాంకు ఎంత రుణమిచ్చిందో ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడుపుతున్నారా? అంటూ మండిపడ్డారు. 3.25 లక్షల మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులను అందిస్తే, వీరికి కాకుండా పొలం యజమానులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు ఆసక్తి చూపుతున్నారన్నారు. డబుల్ బ్యాంకు ఖాతాలు తెరవాలి ఎస్సీ, బీసీ, కాపు రుణాల లబ్ధిదారులకు శుక్రవారంలోపు డబుల్ బ్యాంక్ ఖాతాలను తెరవాలని ఎల్డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావుకు కలెక్టర్ ఆదేశించారు. రెండున్నర లక్షల హెక్టార్లకు గాను 19 వేల హెక్టార్లలో మాత్రమే ఈ–క్రాప్ బుకింగ్ కార్యక్రమం అమలు చేయడంపై జేడీ సాయిలక్ష్మీశ్వరిని ప్రశ్నించారు. మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, నాబార్డు ఏజీఎం రామప్రభు, పశుసంవర్థక వాఖ జేడీ టి.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. తేనె ఉత్పత్తుల ప్రోత్సాహంతో ఆదాయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో తేనె ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు అధిక ఆదాయం సమకూరేలా పటిష్టమైన ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ భాస్కర్ ఉద్యాన శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో ఉద్యానవన తోటల పెంపకంపై హార్టికల్చర్ అధికారులతో కలెక్టరు సమీక్షించారు. తోటలు పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు 48 గంటల్లో సొమ్ము చెల్లించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వచ్చే మార్చినాటికి 50 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటలకు బిందు సేద్యం అమలు చేయాలన్నారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన శాఖ డీడీ వైవీఎస్ ప్రసాద్, ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, మైక్రో ఇరిగేషన పీడీ ఎస్.రామ్మోహనరావు పాల్గొన్నారు.