సమీక్షకు రాకపోతే బ్యాంకర్లపై కేసులు
సమీక్షకు రాకపోతే బ్యాంకర్లపై కేసులు
Published Wed, Aug 17 2016 10:01 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో): జిల్లాలో మీటింగ్‌కు పిలిస్తే రాకపోతే ఎలా? పేదలు, కౌలు రైతులకు రుణాలివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్ల తీరును సహించబోమని, మండల స్థాయిలో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లకు బ్యాంకు అధికారులు ఇకపై రాకపోతే పోలీస్ కేసు తప్పదని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధాన్యతా రంగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016–17లో ప్రాధాన్యతా రంగాలకు రూ.12,775 కోట్లు రుణాలు ఇస్తామన్నారు. ఖరీఫ్ పంట కాలంలో కౌలు రైతులకు రుణాలివ్వకుండా బ్యాంకర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఏ బ్యాంకు ఎంత రుణమిచ్చిందో ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడుపుతున్నారా? అంటూ మండిపడ్డారు. 3.25 లక్షల మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులను అందిస్తే, వీరికి కాకుండా పొలం యజమానులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు ఆసక్తి చూపుతున్నారన్నారు.
డబుల్ బ్యాంకు ఖాతాలు తెరవాలి
ఎస్సీ, బీసీ, కాపు రుణాల లబ్ధిదారులకు శుక్రవారంలోపు డబుల్ బ్యాంక్ ఖాతాలను తెరవాలని ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావుకు కలెక్టర్ ఆదేశించారు. రెండున్నర లక్షల హెక్టార్లకు గాను 19 వేల హెక్టార్లలో మాత్రమే ఈ–క్రాప్ బుకింగ్ కార్యక్రమం అమలు చేయడంపై జేడీ సాయిలక్ష్మీశ్వరిని ప్రశ్నించారు. మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, నాబార్డు ఏజీఎం రామప్రభు, పశుసంవర్థక వాఖ జేడీ టి.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
తేనె ఉత్పత్తుల ప్రోత్సాహంతో ఆదాయం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో తేనె ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు అధిక ఆదాయం సమకూరేలా పటిష్టమైన ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ భాస్కర్ ఉద్యాన శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉద్యానవన తోటల పెంపకంపై హార్టికల్చర్ అధికారులతో కలెక్టరు సమీక్షించారు. తోటలు పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు 48 గంటల్లో సొమ్ము చెల్లించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వచ్చే మార్చినాటికి 50 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటలకు బిందు సేద్యం అమలు చేయాలన్నారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన శాఖ డీడీ వైవీఎస్ ప్రసాద్, ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, మైక్రో ఇరిగేషన పీడీ ఎస్.రామ్మోహనరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement