రూ.16 వేల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
రూ.16 వేల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
Published Mon, Mar 27 2017 10:13 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.16,560 కోట్లతో జిల్లా వార్షిక రుణప్రణాళికను అమలు చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన వార్షిక రుణప్రణాళికను విడుదల చేశారు. సామాన్యులకు కూడా బ్యాంకు సేవలను అందించాలని, ప్రతి పల్లెలో బ్యాంకు కార్యకలాపాలు సాగించే విధంగా అవసరమైన ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు. ప్రతి పల్లెలో ఏటీఎం కౌంటర్‌ను ఏర్పాటు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చినా స్థలాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.14,560 కోట్లు కేటాయించామని, అప్రాధాన్యతా రంగాలకు రూ.2 వేల కోట్లు కేటాయించామని, వ్యవసాయానికి రూ.6,526 కోట్లు కేటాయించినట్టు ఆయన చెప్పారు. గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూ.1255.61 కోట్లు కేటాయించామన్నారు. జిల్లాలో 6.20 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.1,282 కోట్లు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ ఏజీఎం హరిశంకర్, నాబార్డు ఏజీఎం డీవీఎస్ రామప్రభు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం కె.భాస్కరరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్‌బీహెచ్ ఏజీఎం తులసీదాస్, అప్పారావు, కెనరా బ్యాంకు ఏజీఎం నారాయణరావు, విజయ బ్యాంకు మేనేజర్ సురేంద్రకుమార్, గ్రామీణ బ్యాంకు ఏజీఎం బాలాజీరావు పాల్గొన్నారు.
31 నాటికి నిధులు ఖర్చు చేయాలి
జిల్లాలో ప్రభుత్వ శాఖలు కేటాయించిన బడ్జెట్‌లన్నీ మార్చి 31లోగా ఖర్చు చేయాలని, ట్రెజరీలో తాత్కాలిక ఆంక్షలు ఉన్నప్పటికీ అందరికీ టోకెన్లు జారీ చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ట్రెజరీ శాఖ డెప్యూటీ డైరెక్టర్ లలితను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో, ట్రెజరీ కార్యాలయంలో బిల్లులు తీసుకోవడం లేదని పలువురు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే అన్ని బిల్లులకు చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
Advertisement
Advertisement