పర్యాటక హబ్‌గా పశ్చిమ
పర్యాటక హబ్‌గా పశ్చిమ
Published Wed, Feb 15 2017 12:20 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాను రూ.6,550 కోట్ల అంచనాలతో పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆధ్యా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బీవీకే ప్రొడక్ట్స్, కెనడా ఫైనాన్షియల్ టై అప్ విత్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రతినిధులతో కలెక్టర్ పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు. 32 కిలోమీటర్ల పొడవున ఉన్న కోస్తాతీర ప్రాంతంలో 22 కిలోమీటర్ల పొడవున అల్లూరి సీతారామరాజు కోస్టల్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ చెప్పారు. దీని కోసం 150 ఎకరాల భూమి అభివృద్ధికి, అల్లూరి హైవే నిర్మాణానికి రూ.2,300 కోట్లు ఖర్చుకాగలవని ప్రతిపాదనలు సిద్ధం చేశారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 100 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో వాటర్ స్పాట్స్, వాటర్ ట్రా¯Œ్సపోర్ట్స్ అభివృద్ధి చేసి 7 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కలెక్టర్ వివరించారు. కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వపరంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. 2030 నాటికి జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మూడు దశల్లో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
17న చించినాడలో
వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం
పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తొలిదశగా చించినాడ యలమంచిలిలంకలో ఈనెల 17న వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రారంభించనున్నట్టు టూరిజం కంపెనీ ప్రతినిధి శేషుబాబు చెప్పారు.
Advertisement