officers suspension
-
తీహార్ జైలు అధికారుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: యూనిటెక్ మాజీ ప్రమోటర్లు సంజయ్, అజయ్ చంద్రాతో కుమ్మక్కైయ్యారంటూ తీహార్ జైలు అధికారులు కొందరిని సస్పెండ్ చేయమని, వీరిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా అందించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చంద్ర సోదరులు జైలు నుంచే దందా జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఈడీ విచారణ జరిపి నిర్ధారించింది. జైలు అధికారుల సస్పెన్షన్‌తో పాటు జైలు నిర్వహణపై ఆస్తానా సూచించిన సిఫార్సులను అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. విచారణ సందర్భంగా బెంచ్‌తో నిందితుల న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా వాదించారు. తన క్లయింట్‌కు ఫోరెన్సిక్ ఆడిట్ తాలుకు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఈ కేసులో తన క్లయింట్ నిర్ధోషని తేలితే కాలాన్ని వెనక్కు తిప్పలేరని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా భాషను తాము అంగీకరించమన్నారు. విచారణ మధ్యలో ఉన్నందున నివేదికలు ఇప్పుడే బహిర్గతం చేయలేమన్నారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. -
17వ తేదీ రోజు ఆ ముఖ్యమంత్రికి కాళరాత్రి
భోపాల్: బస చేసిన అతిథిగృహంలో సౌకర్యాలు బాగా లేక ఓ ముఖ్యమంత్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్కన శబ్దాలు.. మరో వైపు దోమల విజృంభణ.. వెరసి ఆ ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. దీని పర్యవసానం తెల్లారి అధికారులపై పడింది. దోమలు కుట్టాయనే నెపంతో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబసభ్యులు, క్షతగాత్రులను పరామర్శించేందుకు ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సిధి ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సర్క్యూట్ హౌస్‌లో సీఎం చౌహన్ బస చేశారు. అయితే బస చేసిన ఆ గృహంలో దోమలు అధికంగా ఉన్నాయంట. దీంతో ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదు. దోమతెర కూడా ఏర్పాటుచేయకపోవడంతో సీఎం చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి 2.30 గంటలకు అధికారులు దోమల మందును పిచికారీ చేశారు. అయితే ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదంట. పక్కనే ఉన్న ట్యాంకర్ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఈ శబ్దానికి ఆయనను నిద్రపోనివ్వలేదు. మోటార్ నిండిపోయి ట్యాంకర్ కారుతుండడంతో సీఎం చౌహన్ లేచి స్వయంగా మోటార్‌ను ఆఫ్ చేశారంట. ఈ విధంగా ముఖ్యమంత్రి అపసోపాలు పడుతూ ఆ రాత్రి గడిపాడు. ఆ తెల్లారి ముఖ్యమంత్రి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సిధి సర్క్యూట్ హౌస్ ఇన్చార్జ్గా ఉన్న సబ్ ఇంజనీర్ బాబులాల్ గుప్తా, మరో ఇంజనీర్ సస్పెండ్‌కు గురయ్యారు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నిద్రలేని రాత్రి గడపడం సోషల్ మీడియాలో హాట్ టాపికయ్యింది. అయితే ప్రతిపక్షాలతో పాటు ప్రజలు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. మేం రోజు నిద్రలేని రాత్రులే గడుపుతున్నామని ప్రజలు సోషల్ మీడియాలో చెబుతున్నారు. ప్రజలకు ఇప్పటికైనా తమ బాధలు తెలిశాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
‘అనంత’ ఆర్టీఏలో ప్రకంపనలు..
అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో జరిగిన నయా మోసం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వానికి లైఫ్‌ట్యాక్స్ చెల్లించకుండా వాహనాల రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్‌బాషాలపై సస్పెన్షన్ వేటు పడింది. మూడు రోజుల క్రితం ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఇన్నోవా కార్లు, ఓ షిఫ్ట్ కారు నిబంధనలకు విరుద్ధంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండానే ఇతరులపై రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా గమనించిన ఆర్టీఏ ఉన్నతాధికారులు మొత్తం ఐదు వాహనాలను గుర్తించారు. అనంతపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో వీటి యజమానులు ఉన్నట్లు తెలుసుకున్నారు. సదరు వాహనాలను సీజ్ చేసిన అధికారులు అక్రమ బాగోతంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ చేపట్టారు. ఏజెంట్లు మాత్రమే కాకుండా కొందరు అధికారులకు తెలిసే ఈ తతంగం జరిగిందని ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండానే వాహనాలను రిజి్రస్టేషన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాలిక్‌బాషా, ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషాలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆర్టీఏ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
అర్ధరాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పాణ్యం : మండల కేంద్రమైన పాణ్యంలోని గిరిజన సంక్షేమ గురుకుల (బాలుర)పాఠశాలను సోమవారం అర్ధరాత్రి కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ పాఠశాలకు వచ్చేసరికి ప్రధాన గేట్లు తాళం వేసి ఉన్నారు. ఎంత పిలిచినా సిబ్బంది ఎవరూ బయటకు రాలేదు. దీంతో అరగంట పైగానే కలెక్టర్ గేటు బయటే నిల్చున్నారు. చేసేదేమీ లేక కలెక్టర్ గన్‌మెన్, అటెండర్ గోడలు దూకి తాళాలను పగులగొట్టారు. రెండో ప్రధాన గేటు తాళాన్ని కూడా పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కలెక్టర్ లోపలికి వెళ్లగా కేవలం అందులో విద్యార్థులు మాత్రమే ఉండంతో వారిని నిద్రలేపారు. పాఠశాలలో పని చేస్తున్న వార్డెన్, వాచ్మెన్, అటెండర్, ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది ఎక్కడ ఉన్నారని ఆరా తీసి వారికి ఫోన్ చేశారు. హుటాహుటిన ప్రిన్సిపాల్ మేరిసలోమితోపాటు ఇతర సిబ్బంది కలెక్టర్ ముందుకు వచ్చారు. ఎందుకు తాళం తీయలేదని, పాఠశాలలో నైట్ వాచ్మెన్, ఇతర సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో తక్షణమే వారిని విధులనుంచి తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సలోమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
‘ఖాకీ’ వసూల్!
సాక్షి, కర్నూలు : జనరల్ డ్యూటీ నుంచి బ్యాండు గ్రూపునకు బదిలీ చేయాలంటే రూ.40వేలు, ఎంటీ సెక్షన్‌కు బదిలీ చేసి అటాచ్మెంట్ కింద విధులు కేటాయించాలంటే రూ.60వేలు, బయట కంపెనీల నుంచి హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేయడానికి రూ.30వేలు..కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఓ అధికారి నిర్ణయించిన ధరల పట్టిక ఇదీ. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగుచూసింది. దీంతో ‘ఆరుగురు’ వసూల్ రాజాలపై వేటు పడింది. ఈ అంశం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ ఎస్ఐ , ఎంటీ సెక్షన్ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేస్తూ బెటాలియన్ ఐజీ బి. శ్రీనివాసులు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వసూళ్ల రాజాలను తక్షణమే కేటాయించిన స్థానాలకు వెళ్లిపోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏఆర్ ఎస్ఐను ఐదో బెటాలియన్‌కు, ఎంటీ సెక్షన్ హెడ్‌కానిస్టేబుల్‌ను 16వ బెటాలియన్‌కు, కానిస్టేబుళ్లను ఒకరిని మూడో బెటాలియన్‌కు, మరొకరిని 16వ, ఐదో, 9వ బెటాలియన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ అంశం పటాలంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. రూ.10 కోట్లకు పైగా వసూళ్లు ఉద్యోగుల బదిలీల్లో రూ.10 కోట్లకు పైనే వసూలు చేసినట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. జనరల్ డ్యూటీ నుంచి ఆర్మర్ గ్రూపునకు బదిలీ చేయడానికి ఒక్కో కానిస్టేబుల్ నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. అలాగే జనరల్ డ్యూటీ నుంచి బ్యాండు గ్రూపునకు బదిలీ చేయడానికి ఒకొక్కరి నుంచి రూ. 40వేలు చొప్పున నలుగురు నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు సమాచారం. జనరల్ డ్యూటీ నుంచి ఎంటీ గ్రూపునకు బదిలీ చేసి అటాచ్‌మెంట్‌కు ఒకొక్కరి నుంచి రూ.60వేలు చొప్పున 20 మంది దగ్గర వసూలు చేసినట్లు సమాచారం. బయట కంపెనీల్లో పనిచేసే వారిని హెడ్‌క్వార్టర్‌కు రప్పించడానికి ఒకొక్కరి వద్ద నుంచి రూ.30వేల చొప్పున వంద మంది ఉద్యోగులనుంచి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. అలాగే బెటాలియన్ లూప్‌లైన్ పోస్టులకు కూడా భారీగా ధరలు నిర్ణయించి వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చిల్డ్రన్స్‌పార్కు, మ్యాంగోగార్డెన్, లెమన్‌గార్డెన్, డ్రైనేజీ నిర్వహణ, ప్లంబర్ విధులు వంటి పోస్టుల నియామకానికి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. బయట కంపెనీల నుంచి జనరల్ డ్యూటీలకు బదిలీ చేయడానికి రూ.30వేలు, అక్కడి నుంచి లూప్లైన్లో విధులు నిర్వహించడానికి ఒకొక్కరి నుంచి రూ.25వేల ప్రకారం వసూలు చేసినట్లు సిబ్బంది నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో మూడవ రేంజ్ డీఐజీ వెంకటేష్ వసూళ్ల భాగోతంపై ఇటీవల విచారణ జరిపించి ఆధారాలను సేకరించారు. బదిలీల కోసం ఒక అధికారి డబ్బులు వసూలు చేసినట్లు 14 మంది రాతపూర్వకంగా డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీఎస్పీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం ఏపీఎస్పీ ఐజీ శ్రీనివాసులు దృష్టికి వెళ్లడంతో వసూలు రాజాలపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
15 మంది కస్టమ్స్ ఆఫీసర్లపై వేటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోమారు అధికారులపై కొరడా ఝళిపించింది. అవినీతి, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఇటీవల ఆదాయపన్ను అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులపై వేటువేసింది. అవినీతి, ముడుపులు అందుకున్నారన్న ఆధారాలతో ప్రభుత్వం మంగళవారం 15 మంది సీనియర్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించింది. అందులో ఒకరు ప్రిన్సిపల్ కమిషనర్ హోదా ఉన్న అధికారి కావడం గమనార్హం. వీరిలో కొందరు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ముడుపులు అందుకోవడం, ప్రభుత్వ సొమ్మును కాజేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడం వంటి అభియోగాలతో సీబీఐ ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసిందని ఆర్థిక శాఖాధికారులు పేర్కొన్నారు. వీరిలో ప్రిన్సిపల్ ఏడీజీగా పనిచేస్తున్న అనూప్ శ్రీవాస్తవపై 1996లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఓ సొసైటీకి భూమిని కొనుగోలు చేయడానికి సహకరించారని సీబీఐ కేసు నమోదు చేసింది. జాయింట్ కమిషనర్ నళిన్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఫండమెంటల్ రూల్స్, క్లాస్ జే లోని 56వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రపతి వీరిని తొలగించారు. రానున్న మూడు నెలలపాటు యధావిధిగా వేతనాలు అందుతాయని తెలిపారు. మూడు నెలల ముందు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ అధికారులను తొలగించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెన్నై కమిషనర్ జీ శ్రీ హర్షలను సీబీఐ వలపన్ని పట్టుకుంది. వీరితో పాటు కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్లు అతుల్ దీక్షిత్, వినయ్ బ్రిజ్ సింగ్‌లు ఉన్నారు. ఢిల్లీ జీఎస్టీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ అమ్రేశ్ జైన్, భువనేశ్వర్ జీఎస్టీ జోన్‌కు చెందిన ఎస్ఎస్ బిష్త్, ముంబై జీఎస్టీ జోన్‌కు చెందిన వినోద్ సంగా, వైజాగ్ జీఎస్టీ జోన్‌కు చెందిన రాజు శేఖర్, అలహాబాద్ జీఎస్టీ జోన్‌కు చెందిన మొహమ్మద్ అల్తాఫ్‌లు ఉన్నారు. వీరితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ డిప్యూటీ కమిషనర్ అశోక్ అశ్వాల్ కూడా ముందస్తు పదవీవిరమణ చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. -
మంత్రిది ఉన్మాద పాలన
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఆగ్రహం నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాలన ఉన్మాది పాలనను తలపిస్తోందని నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరులతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా టౌన్‌ప్లానింగ్ అధికారుల కారణంగా కార్పొరేషన్ భ్రష్టుపట్టిందని, ప్రక్షాళన చేసేందుకే సస్పెండ్ చేశారని చెప్పారని, అయితే ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ ఆర్నెల్లు, ఏడాది క్రితం వచ్చిన వారేనని చెప్పారు. మంత్రి ఉన్మాద నిర్ణయాలతో తప్పులు చేయనివారు బలికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మర్ స్టోరేజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరుపుతామన్న మంత్రి ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. చేతనైతే కార్పొరేషన్‌కు నిధులు తీసుకురావాలని హితవు పలికారు. జిల్లాలో సీనియర్ నేతలను కాదని నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నారాయణను సాగనంపి, మంచి మంత్రిని ఎన్నుకోవాలని సూచించారు. కార్పొరేషన్‌లోని అన్ని వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మేయర్ షాడో హోటల్లో దందా దేశంలో ఎక్కడా ఏడుగురు ఉద్యోగులపై విచారణ కూడా లేకుండా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆరోపించారు. మేయర్ షాడో హోటల్లో దందా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దందా చేసే వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని నిరూపించగలరానని ప్రశ్నించారు. ముందుగా మంత్రి వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఆక్రమణలు చేసినట్లు నిరూపిస్తానని, మంత్రి నారాయణ రాజీనామా చేస్తారానని సవాల్ విసిరారు. తాను నిరూపించలేకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, పుల్లారెడ్డి, సత్తార్, తదితరులు పాల్గొన్నారు.