భోపాల్: బస చేసిన అతిథిగృహంలో సౌకర్యాలు బాగా లేక ఓ ముఖ్యమంత్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్కన శబ్దాలు.. మరో వైపు దోమల విజృంభణ.. వెరసి ఆ ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. దీని పర్యవసానం తెల్లారి అధికారులపై పడింది. దోమలు కుట్టాయనే నెపంతో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబసభ్యులు, క్షతగాత్రులను పరామర్శించేందుకు ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సిధి ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సర్క్యూట్ హౌస్‌లో సీఎం చౌహన్ బస చేశారు. అయితే బస చేసిన ఆ గృహంలో దోమలు అధికంగా ఉన్నాయంట. దీంతో ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదు. దోమతెర కూడా ఏర్పాటుచేయకపోవడంతో సీఎం చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి 2.30 గంటలకు అధికారులు దోమల మందును పిచికారీ చేశారు.
అయితే ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదంట. పక్కనే ఉన్న ట్యాంకర్ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఈ శబ్దానికి ఆయనను నిద్రపోనివ్వలేదు. మోటార్ నిండిపోయి ట్యాంకర్ కారుతుండడంతో సీఎం చౌహన్ లేచి స్వయంగా మోటార్‌ను ఆఫ్ చేశారంట. ఈ విధంగా ముఖ్యమంత్రి అపసోపాలు పడుతూ ఆ రాత్రి గడిపాడు. ఆ తెల్లారి ముఖ్యమంత్రి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సిధి సర్క్యూట్ హౌస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సబ్ ఇంజనీర్ బాబులాల్ గుప్తా, మరో ఇంజనీర్ సస్పెండ్‌కు గురయ్యారు.
ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నిద్రలేని రాత్రి గడపడం సోషల్ మీడియాలో హాట్ టాపికయ్యింది. అయితే ప్రతిపక్షాలతో పాటు ప్రజలు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. మేం రోజు నిద్రలేని రాత్రులే గడుపుతున్నామని ప్రజలు సోషల్ మీడియాలో చెబుతున్నారు. ప్రజలకు ఇప్పటికైనా తమ బాధలు తెలిశాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment