sleepless night
-
‘తీహార్’లో కేజ్రీవాల్ కష్టాలు.. పడిపోయిన షుగర్ లెవెల్స్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో తొలిరోజు సోమవారం (ఏప్రిల్ 1) రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అతి కష్టంగా గడిపినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలులోని ప్రిజన్ నెంబర్ 2ను కేటాయించారు. అయితే జైలులో తొలి రోజు కేజ్రీవాల్ సరిగా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు. రాత్రి కొద్దిసేపు మాత్రమే కేజ్రీవాల్ నిద్రపోయారన్నారు. కేజ్రీవాల్‌కు సాయంత్రం టీ ఇచ్చామని, రాత్రికి ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని కేజ్రీవాల్‌కు వడ్డించామని చెప్పారు. కేజ్రీవాల్ నిద్రపోయేందుకుగాను పరుపు, రెండు దిండ్లు, బ్లాంకెట్లు ఇచ్చారు. జైలులో తొలిరోజు సరిగా నిద్ర లేకపోవడం వల్ల కేజ్రీవాల షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయని, డాక్టర్ల సూచన మేరకు ఆయనకు మందులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. జైలులోని డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ‘మంగళవారం తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే కేజ్రీవాల్ కొద్దిసేపు ధ్యానం చేసుకున్నారు. టీ, రెండు బిస్కెట్లు తీసుకున్నారు. రామాయణ, మహాభారత, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అనే పుస్తకాలను అడిగి తీసుకున్నారు‘ అని జైలు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు భారీ ఊరట -
17వ తేదీ రోజు ఆ ముఖ్యమంత్రికి కాళరాత్రి
భోపాల్: బస చేసిన అతిథిగృహంలో సౌకర్యాలు బాగా లేక ఓ ముఖ్యమంత్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్కన శబ్దాలు.. మరో వైపు దోమల విజృంభణ.. వెరసి ఆ ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. దీని పర్యవసానం తెల్లారి అధికారులపై పడింది. దోమలు కుట్టాయనే నెపంతో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబసభ్యులు, క్షతగాత్రులను పరామర్శించేందుకు ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సిధి ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సర్క్యూట్ హౌస్‌లో సీఎం చౌహన్ బస చేశారు. అయితే బస చేసిన ఆ గృహంలో దోమలు అధికంగా ఉన్నాయంట. దీంతో ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదు. దోమతెర కూడా ఏర్పాటుచేయకపోవడంతో సీఎం చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి 2.30 గంటలకు అధికారులు దోమల మందును పిచికారీ చేశారు. అయితే ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదంట. పక్కనే ఉన్న ట్యాంకర్ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఈ శబ్దానికి ఆయనను నిద్రపోనివ్వలేదు. మోటార్ నిండిపోయి ట్యాంకర్ కారుతుండడంతో సీఎం చౌహన్ లేచి స్వయంగా మోటార్‌ను ఆఫ్ చేశారంట. ఈ విధంగా ముఖ్యమంత్రి అపసోపాలు పడుతూ ఆ రాత్రి గడిపాడు. ఆ తెల్లారి ముఖ్యమంత్రి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సిధి సర్క్యూట్ హౌస్ ఇన్చార్జ్గా ఉన్న సబ్ ఇంజనీర్ బాబులాల్ గుప్తా, మరో ఇంజనీర్ సస్పెండ్‌కు గురయ్యారు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నిద్రలేని రాత్రి గడపడం సోషల్ మీడియాలో హాట్ టాపికయ్యింది. అయితే ప్రతిపక్షాలతో పాటు ప్రజలు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. మేం రోజు నిద్రలేని రాత్రులే గడుపుతున్నామని ప్రజలు సోషల్ మీడియాలో చెబుతున్నారు. ప్రజలకు ఇప్పటికైనా తమ బాధలు తెలిశాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
నగరం నిద్రపోవడం లేదు..
సాక్షి సిటీబ్యూరో : సిటీజనులకు కునుకు కరువైంది. ఆహారం, అనారోగ్యం, మానసిక ఆందోళన నగర జీవిని సుఖనిద్రకు దూరం చేస్తోంది. ఆన్లైన్ చాటింగ్‌లు, టీవీలకు అతుక్కుపోవడం, రాత్రి వరకు బాతాఖానీల్లో మునిగిపోతుండడం వంటి వ్యాపకాల వల్ల నిద్ర సమయం మించిపోతోంది. ఈ కారణంగా మన నగరం నిద్రలేమిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటే హైదరా‘బాధ’ అర్ధం చేసుకోవచ్చు. వర్క్‌ఫ్రం హోమ్‌తో పాటు రోజుల తరబడి ఇంట్లోనే ఉండడంతోనూ స్లీపింగ్ వేళలు మారిపోయాయి. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ నిద్రలేమి అందరికీ ‘త్వరగా పడుకోండి.. త్వరగా నిద్రలేవండి.. అది ఆరోగ్యం, సంపదను ఇస్తుంది’ అనే సూత్రం ఇప్పటి యువతకు అర్థమమ్యేలా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైందంటున్నారు పరిశోధకులు. అసలు నేటి యువత అనే కాదు.. మహిళలు, పురుషులు, పిల్లలు సైతం నగరంలో సరిగా నిద్ర పోలేకపోతున్నారని కాస్మోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవిరియల్ సైన్సెస్ (సీఐఎంబీఎస్) సంస్థ అధ్యయనంలో తేలింది. పని ఒత్తిడి, ఆందోళన, ప్రవర్తనలో మార్పులతో పాటు చెడు వ్యసనాలు నిద్రలేమికి దారి తీస్తున్నాయని స్పష్టం చేసింది. ఇవేగాకుండా మారిన జీవనశైలి, విధుల నిర్వహణ, వ్యక్తిగత కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొంది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే ఎక్కువ హైదరాబాద్ నగరంలో ఆది నుంచే జనం అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం, పొద్దుపోయాక లేవడం అలవాటు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో అర్థరాత్రి వరకు విందులు, వేడుకలు ఎక్కువ. మరోవైపు ల్యాప్టాప్స్ లేదంటే మొబైల్ ఫోన్లు ఏదో ఒక దాంతో కాలక్షేపం చేయాల్సిందే! ఇదే నిద్రనూ దూరం చేస్తోందన్నది సుస్పష్టం. కరోనా కూడా ప్రజలను నిద్దురకు దూరం చేసింది. ఈ మహమ్మారి సోకి కోలుకున్న వారిని నిద్రలేమి వేధిస్తోంది. ఈ వైరస్ భయం కూడా మరికొందరిని నిద్ర పోకుండా చేస్తోంది. మొత్తంగా నగరం నిద్రపోవడం లేదు. -
జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్
గాంధీ-నెహ్రు కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మంగళవారం సాయంత్రం బుండి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జైలులో చాలా భయపడినట్టు చెప్పిన పాయల్.. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. జైలులో రాత్రి నిద్ర పట్టలేదని.. చాలా భయమేసిందని చెప్పారు. ‘నేను ఎప్పుడు దేశం గురించే ఆలోచిస్తాను. అలాగే చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అకారణంగా జైలుకు వెళ్లాలని కోరుకోను. భవిష్యత్తులో వీడియోలు తీయడం మానుకోను. ఇకపై మరోసారి తప్పు జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నెహ్రు కుటుంబంపై నేను చేసిన వీడియో.. చిక్కులు తీసుకువస్తుందని అనుకోలేదు. నాకు చట్టాలపై అంతగా అవగాహన లేదు. చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా.. భావ ప్రకటన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటాను. న్యాయవ్యవస్థకు చాలా ధన్యవాదాలు’ అని పాయల్ చెప్పారు. జైలులో గడిపిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘నన్ను లేడీస్ జనరల్ వార్డ్‌లో ఉంచారు. అక్కడ చాలా చలిగా ఉండటంతో.. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపాను. చాపపై పడుకున్నాను. అక్కడి పరిస్థితులు చూస్తే చాలా భయమేసింది. జైలులో ఆహారం అసలు బాగోలేదు. కానీ స్పైసీ ఫుడ్ కోరుకునే వారికి అది బాగుంటుంది. నేను జైలుకు వెళ్లడం మొదటిసారి.. ఇదే చివరిసారి కూడా అవుతుందని అనుకుంటాన’ని తెలిపారు. -
జైలులో సల్మాన్‌కు నిద్రలేని రాత్రి
జోధ్‌పూర్: జింకలను వేటాడిన కేసులో శిక్షననుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కేంద్రీయ కారాగారంలో తొలిరోజు రాత్రి నిద్రలేకుండానే గడిపారని అధికారులు శుక్రవారం చెప్పారు. జైలులోని బ్యారక్ నంబర్ 2లో ఖైదీ నంబర్ 106గా ఉన్న సల్మాన్‌కు ప్రత్యేక సదుపాయాలేవీ కల్పించడం లేదనీ, అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పాలు ఇచ్చామని జైళ్ల డీఐజీ విక్రం చెప్పారు. చెక్క మంచం, రగ్గు, కూలర్ సల్మాన్ గదిలో ఉంటాయన్నారు. సల్మాన్ బెయిలు దరఖాస్తుపై నిర్ణయాన్ని కోర్టు శనివారానికి వాయిదా వేసింది. నటి ప్రీతీ జింతా సల్మాన్‌ను పరామర్శించారు. 1998లో రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్షను సెషన్స్ కోర్టు విధించడం తెలిసిందే. సల్మాన్ చెల్లెళ్లు అర్పిత, అల్విరలు ఆయనను శుక్రవారం కలుసుకున్నారు. జైలు యూనిఫాం ఇంకా సిద్ధం కానందున తన సాధారణ దుస్తులనే సల్మాన్ ధరించారు. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు పక్క గదిలోనే సల్మాన్‌ను ఉంచామనీ, గురువారం రాత్రి వారిద్దరూ పలకరించుకున్నారని సిబ్బంది చెప్పారు. గదిలో టాయిలెట్ గురించి సల్మాన్ అడిగాడనీ, గీజర్ ఉందేమోనని కనుక్కున్నాడని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. రెండో పోస్టుమార్టం పట్టించింది.. కృష్ణజింకల కళేబరాలకు రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం ద్వారానే సల్మాన్ దోషి అని నిరూపితమైంది. కళేబరాల ఎముకల్లో అంగుళం వ్యాసంతో రంధ్రాలు ఉన్నాయనీ, తుపాకీతో పేల్చడం వల్లనే ఇలా జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. -
'మ్యాచ్ ముందు రోజు నిద్రపోలేదు'
హరారే: జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్ ఆడడానికి ముందు రోజు రాత్రి నిద్రపోలేదని టీమిండియా యువ బ్యాట్స్ మన్ మన్దీప్ సింగ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు చాలా ఒత్తిడికి గురైనట్టు వెల్లడించాడు. అయితే బ్యాటింగ్ కు దిగిన తర్వాత తనపై ఒత్తిడి మాయం అయిందన్నాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో మన్దీప్ అర్ధసెంచరీ(52)తో రాణించాడు. 'మ్యాచ్ ఆడడానికి ముందు నిద్రలేని రాత్రి గడిపా. మ్యాచ్ గెలుస్తామా, సిరీస్ దక్కించుకుంటామా అనేదే మదిలో మెదిలింది. నా ఆటను సెలక్టర్లు గమనిస్తున్నారన్న విషయం పదేపదే గుర్తుకు వచ్చింది. బ్యాటింగ్ కు దిగడానికి ముందు కూడా ఒత్తిడి గురయ్యాను. బ్యాటింగ్ ప్రారంభించాక ఒత్తిడి దూదిపింజలా ఎగిరిపోయింది. మ్యాచ్ గెలవాలన్న లక్ష్యం తప్ప మరో ఆలోచన రాలేద'ని మన్దీప్ తెలిపాడు. మొదటి మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం బాధ కలిగించిందన్నాడు. పరాజయం తర్వాత తప్పులను సమీక్షించుకుని రెండో మ్యాచ్ లో బరిలోకి దిగామని మన్దీప్ వెల్లడించాడు. -
కమల్ సినిమా రీమేక్ అట?!
చెన్నై: విలక్షణ కథానాయకుడు, దర్శకుడు కమలహాసన్ తాజా చిత్రం 'తూంగవనం' ఒక విదేశీ భాషా చిత్రానికి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఫ్రెడరిక్ జార్డిన్ దర్శకత్వంలో 2011 విడుదలైన 'న్యూట్ బ్లాంచే' (స్లీప్ లెస్ నైట్స్) అనే ఫ్రెంచ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారట. అయితే తూంగవనం సినిమా విడుదలకు ముందు ఈ విషయాన్ని కమల్‌హాసన్ వెల్లడి చేయాలనుకున్నారట. ఒక పోలీస్ అధికారి తన కొడుకును, తన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం రాత్రికి రాత్రి ఏం చేశాడనే కథాంశంతో రూపొందించిన చిత్రం న్యూట్ బ్లాంచే. దాదాపు తూంగవనం సినిమా కూడా ఇదే స్టోరీ లైన్లో వస్తోంది. మరోవైపు ఫ్రెంచ్ సినిమాకు కొరియోగ్రాఫర్స్‌గా ఉన్న గిల్స్ కోన్సీల్, సెల్పిన్ గాబెట్, ఆర్నాడ్ ఈ సినిమాకు కూడా పనిచేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తూంగవనం సినిమాకు కమల్ చిరకాల మిత్రుడు రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన భూమికను పోషిస్తున్నీ ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా తెలుగు,తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో తూంగవనం, తెలుగులో చీకటి రాజ్యం పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఇటీవల ఒక స్టంట్, చేజింగ్ దృశ్యాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. -
భూకంప వదంతులతో రోడ్లపైనే జాగారం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో భూకంప వదంతులు ....ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేశాయి. భూకంపం వస్తోందని పుకార్లతో జనాలంతా నిద్ర పోకుండా రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాల్లో భూకంప పుకార్లు షికారు చేయటంతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీనికి తోడు భూకంప పుకార్లు సెల్ఫోన్ల ద్వారా మూరుమూల గ్రామాలకు పాకి పోవటంతో ఎవరికి వారు తమ బంధువులకు ఫోన్లు ద్వారా సమాచారం అందించారు. దాంతో వారు కూడా నిద్ర పోకుండా జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భూకంప వదంతులు షికార్లు చేశాయి. కాగా భూకంప వదంతులను ఆ శాఖ కొట్టిపారేసింది. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది. -
జైల్లో నిద్రలేని రాత్రి గడిపిన భత్కల్
భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన కరుడు గట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ పాట్నాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతమైన మిలటరీ క్యాంప్ జైలులో నిన్న రాత్రింతా నిద్రపోలేదని ఆ జైలు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ తెలిపారు. అలాగే అతడు ఒత్తిడి కూడా గుర్యయాడని చెప్పారు. భత్కల్‌తోపాటు చిక్కిన అసదుల్లా అక్తర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉందని పేర్కొన్నారు. తీవ్రవాదులు ఇద్దరు కూడా రాత్రి చాలా తక్కువగా ఆహారం తీసుకున్నారని, అలాగే మంచి నీరు కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పారు. ఆహారం తీసుకున్న సమయంలో తప్ప మిగతా సమయంలో అసలు మాట్లాడనే లేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. వారిరువురిని న్యూఢిల్లీలో విచారించేందుకు తమకు అనుమతి ఇప్పించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన అధికారుల అభ్యర్థనపై బీహార్ కోర్టు సానుకూలంగా స్పందించింది. వారిని మూడో రోజుల పాటు ఎన్ఐఏ ఉన్నతాధికారులకు అప్పగించాలని బీహార్ పోలీసులను కోర్టు గురువారం ఆదేశించింది. దాంతో ఆ తీవ్రవాదులిద్దరిని ఈ రోజు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ తరలించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యాసిన్ భత్కల్ బాంబు పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించాడు. అతడిని తమకు అప్పగించాలని కేంద్రం హోం మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఇప్పటికే 12 రాష్ట్రాలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.