జోధ్‌పూర్: జింకలను వేటాడిన కేసులో శిక్షననుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కేంద్రీయ కారాగారంలో తొలిరోజు రాత్రి నిద్రలేకుండానే గడిపారని అధికారులు శుక్రవారం చెప్పారు. జైలులోని బ్యారక్ నంబర్ 2లో ఖైదీ నంబర్ 106గా ఉన్న సల్మాన్‌కు ప్రత్యేక సదుపాయాలేవీ కల్పించడం లేదనీ, అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పాలు ఇచ్చామని జైళ్ల డీఐజీ విక్రం చెప్పారు. చెక్క మంచం, రగ్గు, కూలర్ సల్మాన్ గదిలో ఉంటాయన్నారు. సల్మాన్ బెయిలు దరఖాస్తుపై నిర్ణయాన్ని కోర్టు శనివారానికి వాయిదా వేసింది.
నటి ప్రీతీ జింతా సల్మాన్‌ను పరామర్శించారు. 1998లో రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్షను సెషన్స్ కోర్టు విధించడం తెలిసిందే. సల్మాన్ చెల్లెళ్లు అర్పిత, అల్విరలు ఆయనను శుక్రవారం కలుసుకున్నారు. జైలు యూనిఫాం ఇంకా సిద్ధం కానందున తన సాధారణ దుస్తులనే సల్మాన్ ధరించారు. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు పక్క గదిలోనే సల్మాన్‌ను ఉంచామనీ, గురువారం రాత్రి వారిద్దరూ పలకరించుకున్నారని సిబ్బంది చెప్పారు. గదిలో టాయిలెట్ గురించి సల్మాన్ అడిగాడనీ, గీజర్ ఉందేమోనని కనుక్కున్నాడని జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
రెండో పోస్టుమార్టం పట్టించింది..
కృష్ణజింకల కళేబరాలకు రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం ద్వారానే సల్మాన్ దోషి అని నిరూపితమైంది. కళేబరాల ఎముకల్లో అంగుళం వ్యాసంతో రంధ్రాలు ఉన్నాయనీ, తుపాకీతో పేల్చడం వల్లనే ఇలా జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment