జైపూర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్‌పూర్ కోర్టులోని తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది
కృష్ణజింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్ హైకోర్టులో లాయర్ హస్తిమల్ సల్మాన్ తరుపున వాదిస్తున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో సల్మాన్ లాయర్‌కు భద్రతను పెంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే లేఖలో చివరన ఎల్‌బీ, జీవీ అనే అక్షరాలు రాసి ఉండటంతో ఇది గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌ల పేర్లను సూచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మే 29న పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గత నెలలో సిద్ధూ మూస్ వాలా హత్యకు తనదే బాధ్యత అంటూ ప్రకటించాడు. అంతేగాక మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి ఈ పనిచేసినట్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా సరిగ్గా నెల కిందట కూడా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై సల్మాన్ బాంద్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
Comments
Please login to add a commentAdd a comment