జైపూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుర్రం పేరిట దుండగులు ఓ మహిళను మోసం చేశారు. సల్మాన్ గుర్రం అమ్ముతామని చెప్పి ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. డబ్బులిచ్చాక గుర్రాన్ని ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసి దాదాపు పది నెలలైనా పట్టించుకోవడం లేదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళ సంతోశ్ భాటికి గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఆమె ఆసక్తిని గమనించిన ముగ్గురు మోసగాళ్లు ఆమెను సంప్రదించారు. హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన ఒక గుర్రం అమ్మకానికి ఉందని.. అది మీకు అమ్మి పెడతామని ఆమెను నమ్మించారు. ఈ సందర్భంగా ఆమెను నమ్మించేందుకు సల్మాన్‌కు చెందిన కొన్ని గుర్రాలను తాము గతంలో విక్రయించినట్లు చెప్పారు. దీంతోపాటు సల్మాన్ ఖాన్ గుర్రాలతో కలిసి దిగిన ఫొటోలు చూపించి ఆమెను నమ్మించారు.
దీంతో ఆ గుర్రం కొనేందుకు ఆమె అంగీకరించింది. చర్చల అనంతరం చివరకు రూ.12 లక్షలకు గుర్రం ఇస్తామని మోసగాళ్లు చెప్పారు. ఇప్పుడు తక్కువకు కొని తర్వాత నీవు అధిక మొత్తానికి విక్రయించుకోవచ్చని అత్యాశపెట్టారు. వారి మాటలను నమ్మి బుట్టలో పడిన ఆమె రూ.11 లక్షల నగదు, రూ.లక్ష చెక్ ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకుని వెళ్లిన ముగ్గురు ఎంతకీ గుర్రాన్ని తీసుకొచ్చి ఆమెకు ఇవ్వలేదు. వారిని సంప్రదించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది.
2020 ఆగస్టులో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నెలలైనా తన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. సమగ్రంగా, పారదర్శకంగా తన కేసును దర్యాప్తు చేయాలని కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. రాజస్థాన్ హైకోర్టు ఆమె పిటిషన్‌ను గురువారం విచారణ చేసింది. సంబంధిత పోలీస్ అధికారికి ఈ కేసు గురించి తెలపాలని, ఆ అధికారి చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment