జైల్లో నిద్రలేని రాత్రి గడిపిన భత్కల్
భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన కరుడు గట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ పాట్నాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతమైన మిలటరీ క్యాంప్ జైలులో నిన్న రాత్రింతా నిద్రపోలేదని ఆ జైలు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ తెలిపారు. అలాగే అతడు ఒత్తిడి కూడా గుర్యయాడని చెప్పారు.
భత్కల్తోపాటు చిక్కిన అసదుల్లా అక్తర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉందని పేర్కొన్నారు. తీవ్రవాదులు ఇద్దరు కూడా రాత్రి చాలా తక్కువగా ఆహారం తీసుకున్నారని, అలాగే మంచి నీరు కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పారు. ఆహారం తీసుకున్న సమయంలో తప్ప మిగతా సమయంలో అసలు మాట్లాడనే లేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు.
వారిరువురిని న్యూఢిల్లీలో విచారించేందుకు తమకు అనుమతి ఇప్పించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన అధికారుల అభ్యర్థనపై బీహార్ కోర్టు సానుకూలంగా స్పందించింది. వారిని మూడో రోజుల పాటు ఎన్ఐఏ ఉన్నతాధికారులకు అప్పగించాలని బీహార్ పోలీసులను కోర్టు గురువారం ఆదేశించింది.
దాంతో ఆ తీవ్రవాదులిద్దరిని ఈ రోజు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ తరలించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యాసిన్ భత్కల్ బాంబు పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించాడు. అతడిని తమకు అప్పగించాలని కేంద్రం హోం మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఇప్పటికే 12 రాష్ట్రాలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.