సాక్షి సిటీబ్యూరో : సిటీజనులకు కునుకు కరువైంది. ఆహారం, అనారోగ్యం, మానసిక ఆందోళన నగర జీవిని సుఖనిద్రకు దూరం చేస్తోంది. ఆన్‌లైన్ చాటింగ్‌లు, టీవీలకు అతుక్కుపోవడం, రాత్రి వరకు బాతాఖానీల్లో మునిగిపోతుండడం వంటి వ్యాపకాల వల్ల నిద్ర సమయం మించిపోతోంది. ఈ కారణంగా మన నగరం నిద్రలేమిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటే హైదరా‘బాధ’ అర్ధం చేసుకోవచ్చు. వర్క్‌ఫ్రం హోమ్‌తో పాటు రోజుల తరబడి ఇంట్లోనే ఉండడంతోనూ స్లీపింగ్ వేళలు మారిపోయాయి. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
నిద్రలేమి అందరికీ
‘త్వరగా పడుకోండి.. త్వరగా నిద్రలేవండి.. అది ఆరోగ్యం, సంపదను ఇస్తుంది’ అనే సూత్రం ఇప్పటి యువతకు అర్థమమ్యేలా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైందంటున్నారు పరిశోధకులు. అసలు నేటి యువత అనే కాదు.. మహిళలు, పురుషులు, పిల్లలు సైతం నగరంలో సరిగా నిద్ర పోలేకపోతున్నారని కాస్మోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవిరియల్ సైన్సెస్ (సీఐఎంబీఎస్) సంస్థ అధ్యయనంలో తేలింది. పని ఒత్తిడి, ఆందోళన, ప్రవర్తనలో మార్పులతో పాటు చెడు వ్యసనాలు నిద్రలేమికి దారి తీస్తున్నాయని స్పష్టం చేసింది. ఇవేగాకుండా మారిన జీవనశైలి, విధుల నిర్వహణ, వ్యక్తిగత కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొంది.
ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే ఎక్కువ
హైదరాబాద్ నగరంలో ఆది నుంచే జనం అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం, పొద్దుపోయాక లేవడం అలవాటు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో అర్థరాత్రి వరకు విందులు, వేడుకలు ఎక్కువ. మరోవైపు ల్యాప్‌టాప్స్ లేదంటే మొబైల్ ఫోన్లు ఏదో ఒక దాంతో కాలక్షేపం చేయాల్సిందే! ఇదే నిద్రనూ దూరం చేస్తోందన్నది సుస్పష్టం. కరోనా కూడా ప్రజలను నిద్దురకు దూరం చేసింది. ఈ మహమ్మారి సోకి కోలుకున్న వారిని నిద్రలేమి వేధిస్తోంది. ఈ వైరస్ భయం కూడా మరికొందరిని నిద్ర పోకుండా చేస్తోంది. మొత్తంగా నగరం నిద్రపోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment