కమల్ సినిమా రీమేక్ అట?!
చెన్నై: విలక్షణ కథానాయకుడు, దర్శకుడు కమలహాసన్ తాజా చిత్రం 'తూంగవనం' ఒక విదేశీ భాషా చిత్రానికి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఫ్రెడరిక్ జార్డిన్ దర్శకత్వంలో 2011 విడుదలైన 'న్యూట్ బ్లాంచే' (స్లీప్ లెస్ నైట్స్) అనే ఫ్రెంచ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారట. అయితే తూంగవనం సినిమా విడుదలకు ముందు ఈ విషయాన్ని కమల్హాసన్ వెల్లడి చేయాలనుకున్నారట.
ఒక పోలీస్ అధికారి తన కొడుకును, తన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం రాత్రికి రాత్రి ఏం చేశాడనే కథాంశంతో రూపొందించిన చిత్రం న్యూట్ బ్లాంచే. దాదాపు తూంగవనం సినిమా కూడా ఇదే స్టోరీ లైన్లో వస్తోంది. మరోవైపు ఫ్రెంచ్ సినిమాకు కొరియోగ్రాఫర్స్గా ఉన్న గిల్స్ కోన్సీల్, సెల్పిన్ గాబెట్, ఆర్నాడ్ ఈ సినిమాకు కూడా పనిచేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది.
కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న తూంగవనం సినిమాకు కమల్ చిరకాల మిత్రుడు రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన భూమికను పోషిస్తున్నీ ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా తెలుగు,తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో తూంగవనం, తెలుగులో చీకటి రాజ్యం పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఇటీవల ఒక స్టంట్, చేజింగ్ దృశ్యాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.