CM Shivraj Singh Chauhan
-
అందరికీ ‘రామ్ రామ్’
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. -
MP: కౌంటింగ్ వేళ క్యాబినెట్ మీటింగ్.. కాంగ్రెస్ అభ్యంతరం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరితో పాటు సీనియర్ అధికారులను కూడా పిలిచారు. ఎటువంటి అజెండా లేకుండా ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపును ప్రభావితం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ ఆరోపించారు. బాలాఘాట్ పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందుగా ఇలా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెయిన్స్ పదవీ విరమణ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిగా వీర రాణా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిన్స్ తర్వాత రాష్ట్రంలో ఆమె సీనియర్ మోస్ట్ అధికారి. -
సీఎం శివరాజ్ సింగ్ మంచి నటుడు: కమల్‌నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. అయితే సీఎం కుర్చీపోయినా శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉద్యోగానికి ఢోకా లేదని నాథ్ చెప్పారు. శివరాజ్‌సింగ్ మంచి నటుడని, సీఎం పదవి పోయిన తర్వాత ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని కమల్‌నాథ్ చమత్కరించారు. సాగర్ జిల్లాలోని రేహ్లీ అసెంబ్లీ స్థానంలో ప్రచారం సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇంటికెళ్లడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన శివరాజ్‌సింగ్ కనీసం బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీల మెషీన్ డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందని, దీనిని ప్రజలు గమనించాలని కమల్‌నాథ్ కోరారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గతంలో సీఎంగా పనిచేసిన కమల్‌నాథ్ కాంగ్రెస్ తరపున మళ్లీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఇదీ చదవండి..కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
మహిళల కోసం ‘లాడ్లి బెహనా’యోజన
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్లైన్లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది. ఇందుకు అర్హులుగా.. ఆదాయ పన్ను చెల్లించని, వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండే వారు, తదితర కేటగిరీలను నిర్ణయించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.8 వేల కోట్లను కేటాయించారు. మార్చి 15–ఏప్రిల్ 30 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!
భోపాల్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక వందలాది మంది కరోనా బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు కరోనా మ్యూటెంట్ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి పైగా ప్రజలు మరణించారు. చైనీస్ కరోనాగా ప్రారంభమై, ఇప్పుడు ఇండియన్ వేరియంట్ కరోనాగా మారింది. దీన్ని చూసి ప్రధాని, రాష్ట్రపతి భయపడుతున్నారు అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ఓ వైపు జనాలు ప్రాణాలు కోల్పోతుంటే..కాంగ్రెస్ పార్టీ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుందని మండిపడ్డారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కరోనా ‘‘ఇండియన్ వేరియంట్’’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దీనిపై సోనియా గాంధీ స్పందించకుండా ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. కమల్ నాథ్ మాటలను సోనియా అంగీకరిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ రోజు రాష్ట్రంలో 7000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారన్నారు. కొత్తగా 2,936 కరోనా కేసులు మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.2 కి పడిపోయిందని పేర్కొన్నారు. అయిన్పటికీ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. (చదవండి: Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ) -
17వ తేదీ రోజు ఆ ముఖ్యమంత్రికి కాళరాత్రి
భోపాల్: బస చేసిన అతిథిగృహంలో సౌకర్యాలు బాగా లేక ఓ ముఖ్యమంత్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్కన శబ్దాలు.. మరో వైపు దోమల విజృంభణ.. వెరసి ఆ ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. దీని పర్యవసానం తెల్లారి అధికారులపై పడింది. దోమలు కుట్టాయనే నెపంతో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబసభ్యులు, క్షతగాత్రులను పరామర్శించేందుకు ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సిధి ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సర్క్యూట్ హౌస్‌లో సీఎం చౌహన్ బస చేశారు. అయితే బస చేసిన ఆ గృహంలో దోమలు అధికంగా ఉన్నాయంట. దీంతో ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదు. దోమతెర కూడా ఏర్పాటుచేయకపోవడంతో సీఎం చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి 2.30 గంటలకు అధికారులు దోమల మందును పిచికారీ చేశారు. అయితే ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదంట. పక్కనే ఉన్న ట్యాంకర్ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఈ శబ్దానికి ఆయనను నిద్రపోనివ్వలేదు. మోటార్ నిండిపోయి ట్యాంకర్ కారుతుండడంతో సీఎం చౌహన్ లేచి స్వయంగా మోటార్‌ను ఆఫ్ చేశారంట. ఈ విధంగా ముఖ్యమంత్రి అపసోపాలు పడుతూ ఆ రాత్రి గడిపాడు. ఆ తెల్లారి ముఖ్యమంత్రి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సిధి సర్క్యూట్ హౌస్ ఇన్చార్జ్గా ఉన్న సబ్ ఇంజనీర్ బాబులాల్ గుప్తా, మరో ఇంజనీర్ సస్పెండ్‌కు గురయ్యారు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నిద్రలేని రాత్రి గడపడం సోషల్ మీడియాలో హాట్ టాపికయ్యింది. అయితే ప్రతిపక్షాలతో పాటు ప్రజలు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. మేం రోజు నిద్రలేని రాత్రులే గడుపుతున్నామని ప్రజలు సోషల్ మీడియాలో చెబుతున్నారు. ప్రజలకు ఇప్పటికైనా తమ బాధలు తెలిశాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మహామహులను విస్మరించారు
రాజ్‌గఢ్ (మధ్యప్రదేశ్): జాతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మహామహులను విస్మరించి.. కేవలం ఒక్క కుటుంబాన్నే గొప్పగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, గందరగోళం, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘ఒక్క కుటుంబాన్ని గొప్పగా చూపించేందుకు దురదృష్టవశాత్తూ మిగిలిన మహామహులు చేసిన ప్రయత్నాలను చిన్నవిచేసి చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. దేశాన్ని ఎక్కువరోజులు పాలించిన పార్టీ.. ప్రజలను, వారి కష్టాన్ని ఎన్నడూ విశ్వసించలేదు’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారు. మోహన్‌పుర ప్రాజెక్టు క్రెడిట్.. దీని నిర్మాణంలో అహోరాత్రులు శ్రమించిన కార్మికులకే దక్కాలన్నారు. ప్రాజెక్టు కోసం కష్టపడిన వారందరినీ అభినందించారు. రూ.3,866 కోట్లతో నెవాజ్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 727 గ్రామాలకు తాగునీరు, 3లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. 80 లక్షల ఎకరాలు సాగు లక్ష్యంతో.. బీజేపీ మధ్యప్రదేశ్‌లో అధికారంలో వచ్చేనాటికి రాష్ట్రంలో 7.5 లక్షల హెక్టార్లకే సాగునీరు అందేదని.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పగ్గాలు చేపట్టాక 40 లక్షల హెక్టార్లు సస్యశ్యామలం అయ్యాయన్నారు. 2024 వరకు దీన్ని 80 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి రేటు ఐదేళ్లుగా 18 శాతంగా ఉందని.. అన్ని రాష్ట్రాలకన్నా ఇదే అధికమని మోదీ తెలిపారు. ‘కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అనారోగ్య రాష్ట్రాలుగా పరిగణించేవారు) జాబితాలో ఉండేది. కాంగ్రెస్ దీన్ని ప్రజలను అవమానించినట్లుగా భావించలేదు. మేం అధికారంలోకి వచ్చాక కష్టపడి ఈ ట్యాగ్ లేకుండా చేశాం. మధ్యప్రదేశ్‌లో 13 ఏళ్లుగా, కేంద్రంలో నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ బీజేపీ.. పేదలు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలకు సాధికారత కల్పించింది. గత నాలుగేళ్లలో మేం నిరాశ, భయం గురించి మేం మాట్లాడలేదు. ప్రజలు మమ్మల్ని నమ్మారు. వారి సంక్షేమంకోసం మేం విశ్వాసంతో ముందుకెళ్తూనే ఉన్నాం’ అని ప్రధాని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేక కొందరు అవాస్తవాలను, గందరగోళాన్ని, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. శ్యామాప్రసాద్ స్ఫూర్తితో.. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు తమకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ‘దేశ తొలి పారిశ్రామిక విధానాన్ని ముఖర్జీ రూపొందించారు. గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆర్థిక, విద్య, వైద్య, మహిళాసాధికారత, అణువిధానం, దేశ భద్రత తదితర రంగాల్లో ఆయన ఆలోచనలు నేటికీ సందర్భోచితమే. యువత నైపుణ్యాన్ని పెంచుకోవడం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన విశ్వసించారు. ఆ దిశగా పనిచేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు నేటికీ మా ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకమే. ఆయన ఆలోచనలను మేం అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాం’ అని మోదీ తెలిపారు. అనంతరం ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. స్వచ్ఛతలో దేశానికి ఇండోర్ స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యం కారణంగానే వరుసగా రెండో ఏడాదీ దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ నిలిచిందని మోదీ అభినందించారు. -
రైతులపై పేలిన తూటా!
ఐదుగురి మృతి.. మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లాలో ఘటన ► పోలీసు కాల్పుల్లోనే చనిపోయారన్న ఆందోళనకారులు ► కాల్పులు జరపలేదంటున్న పోలీసులు ► మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లాలో మంగళవారం రైతులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పిపాల్యా మండీ పోలీస్ పరిధిలోని పార్శ్వనాథ్ ప్రాంతంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు రైతులు మృతిచెందారు. పోలీసులు కాల్పులు జరపడం వల్లే వీరు చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే తాము అసలు కాల్పులే జరపలేదని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వి, వాహనాలను తగలబెట్టారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ ఎస్.కె. సింగ్ వెల్లడించారు. ‘కాల్పులు జరపలేదని పోలీసులు నాకు చెప్పారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరుగుతోంది. నివేదిక వచ్చాక వివరాలు తెలుస్తాయి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తాం’ అని తెలిపారు. మృతులను కన్హయ్యలాల్ పటీదార్, బబ్లూ పటీదార్, అభిషేక్ పటీదార్, చైన్ సింగ్ పటీదార్, సత్యనారాయన్గా గుర్తించారు. అభిషేక్, సత్యానారాయన్లను చికిత్స కోసం ఇండోర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని రాష్ట్ర పటీదార్ సమాజ్ అధ్యక్షుడు మహేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్.. పశ్చిమ మధ్యప్రదేశ్ రైతులు తమ పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని, రుణాలను మాఫీ చేయాలని ఈ నెల 1 నుంచి ఉద్యమిస్తున్నారు. పిపాల్యా మండీలోని పార్శ్వనాథ్లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకుంది. పాపిల్యాలో కర్ఫ్యూను, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పొరుగున ఉన్న రత్లాం జిల్లాలోనూ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఇండోర్‌లో తమపై రాళ్లు రువ్విన రైతులను పోలీసులు లాఠీచార్జీతో చెదరగొట్టారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. వదంతులు వ్యాపించకుండా మంద్సౌర్, రత్లాం, నీముచ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ధర్ జిల్లాలో రైతులు ఇండోర్–అహ్మదాబాద్ జాతీయ రహదారిని మూడు గంటలపాటు దిగ్బంధించారు. రత్లాం జిల్లాలో ఆదివారం ఇద్దరు పోలీసులు గాయపడిన ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న రైతు నాయకుల ఆచూకీ తెలిపితే బహుమానం ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. విపక్షాలు రెచ్చగొడుతున్నాయి: సీఎం రాష్ట్రంలో విపక్షాలు హింసను ఎగదోస్తున్నాయని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఆయన రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పిపాల్యా మండీలో పోలీసులుగాని, సీఆర్పీఎఫ్ జవాన్లుగాని కాల్పులు జరపలేదని రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ‘వివరాలు తెలుసుకుంటున్నాం. గుంపు లోపలి నుంచి ఎవరైనా కాల్పులు జరిపి ఉండే అవకాశముంది. అందుకే దర్యాప్తునకు ఆదేశించాం’ అని చెప్పారు, మంద్సౌర్, నీముచ్ జిల్లాల్లో కొన్ని రోజులుగా సంఘవిద్రోహ శక్తులు హింసను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్ రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం శివరాజ్ సింగ్‌కు ఈ ఘటన సిగ్గుచేటు అని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల గొంతు నొక్కడానికి తూటాలు ప్రయోగిస్తోందని మండిపడ్డారు. మంద్సౌర్ ఘటనపై కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర చరిత్రో ఇది చీకటి రోజు అని, బీజేపీ ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా కాల్పులకు దిగుతోందని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. కాంగ్రెస్ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. తూటాలు తినిపిస్తున్నారు: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రైతులపై యుద్ధం చేస్తూ వారికి తూటాలను తినిపిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘బీజేపీ చెబుతున్న నవ భారత్‌లో హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు తూటాలు ప్రతిఫలంగా దక్కుతున్నాయి’ అని ట్వీట్ చేశారు.