
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరితో పాటు సీనియర్ అధికారులను కూడా పిలిచారు. ఎటువంటి అజెండా లేకుండా ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఓట్ల లెక్కింపును ప్రభావితం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ ఆరోపించారు. బాలాఘాట్ పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారని ఆరోపించారు.
ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందుగా ఇలా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెయిన్స్ పదవీ విరమణ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిగా వీర రాణా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిన్స్ తర్వాత రాష్ట్రంలో ఆమె సీనియర్ మోస్ట్ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment