ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి తలపాగా బహూకరిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
రాజ్‌గఢ్ (మధ్యప్రదేశ్): జాతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మహామహులను విస్మరించి.. కేవలం ఒక్క కుటుంబాన్నే గొప్పగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, గందరగోళం, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మోహన్‌పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
‘ఒక్క కుటుంబాన్ని గొప్పగా చూపించేందుకు దురదృష్టవశాత్తూ మిగిలిన మహామహులు చేసిన ప్రయత్నాలను చిన్నవిచేసి చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. దేశాన్ని ఎక్కువరోజులు పాలించిన పార్టీ.. ప్రజలను, వారి కష్టాన్ని ఎన్నడూ విశ్వసించలేదు’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారు. మోహన్‌పుర ప్రాజెక్టు క్రెడిట్.. దీని నిర్మాణంలో అహోరాత్రులు శ్రమించిన కార్మికులకే దక్కాలన్నారు. ప్రాజెక్టు కోసం కష్టపడిన వారందరినీ అభినందించారు. రూ.3,866 కోట్లతో నెవాజ్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 727 గ్రామాలకు తాగునీరు, 3లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది.
80 లక్షల ఎకరాలు సాగు లక్ష్యంతో..
బీజేపీ మధ్యప్రదేశ్‌లో అధికారంలో వచ్చేనాటికి రాష్ట్రంలో 7.5 లక్షల హెక్టార్లకే సాగునీరు అందేదని.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పగ్గాలు చేపట్టాక 40 లక్షల హెక్టార్లు సస్యశ్యామలం అయ్యాయన్నారు. 2024 వరకు దీన్ని 80 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి రేటు ఐదేళ్లుగా 18 శాతంగా ఉందని.. అన్ని రాష్ట్రాలకన్నా ఇదే అధికమని మోదీ తెలిపారు. ‘కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అనారోగ్య రాష్ట్రాలుగా పరిగణించేవారు) జాబితాలో ఉండేది.
కాంగ్రెస్ దీన్ని ప్రజలను అవమానించినట్లుగా భావించలేదు. మేం అధికారంలోకి వచ్చాక కష్టపడి ఈ ట్యాగ్ లేకుండా చేశాం. మధ్యప్రదేశ్‌లో 13 ఏళ్లుగా, కేంద్రంలో నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ బీజేపీ.. పేదలు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలకు సాధికారత కల్పించింది. గత నాలుగేళ్లలో మేం నిరాశ, భయం గురించి మేం మాట్లాడలేదు. ప్రజలు మమ్మల్ని నమ్మారు. వారి సంక్షేమంకోసం మేం విశ్వాసంతో ముందుకెళ్తూనే ఉన్నాం’ అని ప్రధాని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేక కొందరు అవాస్తవాలను, గందరగోళాన్ని, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు.
శ్యామాప్రసాద్ స్ఫూర్తితో..
స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు తమకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ‘దేశ తొలి పారిశ్రామిక విధానాన్ని ముఖర్జీ రూపొందించారు. గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆర్థిక, విద్య, వైద్య, మహిళాసాధికారత, అణువిధానం, దేశ భద్రత తదితర రంగాల్లో ఆయన ఆలోచనలు నేటికీ సందర్భోచితమే. యువత నైపుణ్యాన్ని పెంచుకోవడం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన విశ్వసించారు. ఆ దిశగా పనిచేశారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు నేటికీ మా ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకమే. ఆయన ఆలోచనలను మేం అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాం’ అని మోదీ తెలిపారు. అనంతరం ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. స్వచ్ఛతలో దేశానికి ఇండోర్ స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యం కారణంగానే వరుసగా రెండో ఏడాదీ దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ నిలిచిందని మోదీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment