Syama Prasad Mukherjee
-
'సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు.. అందుకే'
సాక్షి, హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి వివరిద్దామంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు.. అందుకే లేఖలు రాయాలని నిర్ణయించినట్లు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ క్లిష్టమైన ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌ను దేశంలో విలీనం చేశారు. అలాగే కరోనా మహమ్మారిని ప్రధాని మోదీ విజయవంతంగా ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. (‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’) తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంతలా పాలిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. విపక్ష పార్టీలు చెప్పే సూచనలను పెడచెవిన పెడుతున్నారు. కరోనా గురించి మాట్లాడితే అధికార పక్షం ఎదురు దాడి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆఖరికి శవాల విషయం కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయమై నేను సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తాను. దీన్ని ఒక విమర్శలా కాకుండా.. మంచి పద్దతిలో స్వీకరించాలి. ప్రభుత్వం చేస్తున్న కరోనా పరీక్షల్లో ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. లాక్డౌన్ సమయంలోనే ఎక్కువ టెస్టులు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది' అంటూ పేర్కొన్నారు. -
కల నెరవేరింది!
జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు ద్వారా పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని బీజేపీ నెరవేర్చింది. ‘ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు ఉండవు. ఇద్దరు ప్రధానులు ఉండరు. రెండు జాతీయ చిహ్నాలు ఉండవు’అంటూ ఆయన 1950లలోనే నెహ్రూ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కశ్మీర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను 1953 మే 11వ తేదీన అరెస్టు చేశారు. అప్పట్లో ఆ కశ్మీర్లోకి ప్రవేశించాలంటే భారతీయులు గుర్తింపుకార్డు చూపించాల్సి ఉండేది. శ్రీనగర్‌లో జైల్లోనే ఆయన అదే ఏడాది జూన్ 23వ తేదీన అనుమానాస్పద రీతితో కన్నుమూశారు. కలకత్తా వర్సిటీకి పిన్నవయస్సులోనే వీసీ అయిన డాక్టర్ ముఖర్జీ 1929లో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నెహ్రూ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వదిలి, భారతీయ జన్‌సంఘ్‌ను 1951లో స్థాపించారు. ఇదే బీజేపీకి మాతృసంస్థ. 1952 జూన్ 26వ తేదీన పార్లమెంట్లో ప్రసంగించిన ముఖర్జీ.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంపై నెహ్రూను గట్టిగా నిలదీశారు. ఇలాంటి విధానాలు దేశాన్ని ముక్కలుగా చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణాన్ని బీజేపీ మరి చిపోలేకపోయింది. 2004లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్లోకి ప్రవేశించటానికి ముందుగా పంజాబ్‌లోనే పోలీసులు అరెస్టు చేశారని భావించాం. కానీ, అలా జరగలేదు. కశ్మీర్ ప్రభుత్వం, నెహ్రూ కుట్రపన్ని కశ్మీర్లోకి అనుమతించిన ముఖర్జీని, తిరిగి వెళ్లకుండా చేశారు. జమ్మూకశ్మీర్‌లోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేసింది’అని పేర్కొనడం గమనార్హం. -
మహామహులను విస్మరించారు
రాజ్‌గఢ్ (మధ్యప్రదేశ్): జాతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మహామహులను విస్మరించి.. కేవలం ఒక్క కుటుంబాన్నే గొప్పగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, గందరగోళం, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘ఒక్క కుటుంబాన్ని గొప్పగా చూపించేందుకు దురదృష్టవశాత్తూ మిగిలిన మహామహులు చేసిన ప్రయత్నాలను చిన్నవిచేసి చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. దేశాన్ని ఎక్కువరోజులు పాలించిన పార్టీ.. ప్రజలను, వారి కష్టాన్ని ఎన్నడూ విశ్వసించలేదు’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారు. మోహన్‌పుర ప్రాజెక్టు క్రెడిట్.. దీని నిర్మాణంలో అహోరాత్రులు శ్రమించిన కార్మికులకే దక్కాలన్నారు. ప్రాజెక్టు కోసం కష్టపడిన వారందరినీ అభినందించారు. రూ.3,866 కోట్లతో నెవాజ్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 727 గ్రామాలకు తాగునీరు, 3లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. 80 లక్షల ఎకరాలు సాగు లక్ష్యంతో.. బీజేపీ మధ్యప్రదేశ్‌లో అధికారంలో వచ్చేనాటికి రాష్ట్రంలో 7.5 లక్షల హెక్టార్లకే సాగునీరు అందేదని.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పగ్గాలు చేపట్టాక 40 లక్షల హెక్టార్లు సస్యశ్యామలం అయ్యాయన్నారు. 2024 వరకు దీన్ని 80 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి రేటు ఐదేళ్లుగా 18 శాతంగా ఉందని.. అన్ని రాష్ట్రాలకన్నా ఇదే అధికమని మోదీ తెలిపారు. ‘కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అనారోగ్య రాష్ట్రాలుగా పరిగణించేవారు) జాబితాలో ఉండేది. కాంగ్రెస్ దీన్ని ప్రజలను అవమానించినట్లుగా భావించలేదు. మేం అధికారంలోకి వచ్చాక కష్టపడి ఈ ట్యాగ్ లేకుండా చేశాం. మధ్యప్రదేశ్‌లో 13 ఏళ్లుగా, కేంద్రంలో నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ బీజేపీ.. పేదలు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలకు సాధికారత కల్పించింది. గత నాలుగేళ్లలో మేం నిరాశ, భయం గురించి మేం మాట్లాడలేదు. ప్రజలు మమ్మల్ని నమ్మారు. వారి సంక్షేమంకోసం మేం విశ్వాసంతో ముందుకెళ్తూనే ఉన్నాం’ అని ప్రధాని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేక కొందరు అవాస్తవాలను, గందరగోళాన్ని, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. శ్యామాప్రసాద్ స్ఫూర్తితో.. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు తమకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ‘దేశ తొలి పారిశ్రామిక విధానాన్ని ముఖర్జీ రూపొందించారు. గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆర్థిక, విద్య, వైద్య, మహిళాసాధికారత, అణువిధానం, దేశ భద్రత తదితర రంగాల్లో ఆయన ఆలోచనలు నేటికీ సందర్భోచితమే. యువత నైపుణ్యాన్ని పెంచుకోవడం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన విశ్వసించారు. ఆ దిశగా పనిచేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు నేటికీ మా ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకమే. ఆయన ఆలోచనలను మేం అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాం’ అని మోదీ తెలిపారు. అనంతరం ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. స్వచ్ఛతలో దేశానికి ఇండోర్ స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యం కారణంగానే వరుసగా రెండో ఏడాదీ దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ నిలిచిందని మోదీ అభినందించారు. -
ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి: లక్ష్మణ్
హైదరాబాద్: నేటి తరం నేతలు, కార్యకర్తలకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు విధానాలు చెల్లవని చెప్పిన గొప్ప దార్శనికుడు ముఖర్జీ అని పేర్కొన్నారు. ఆనాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆయనతో ముఖర్జీ విభేదించారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాల వల్ల జమ్మూకు ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు రద్దు చేసి భారత రాజ్యాంగంలో కలిసేలా చేశారని గుర్తుచేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా తప్పుపట్టే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని.. దేశంపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు కనపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.