రైతులపై పేలిన తూటా!
ఐదుగురి మృతి.. మధ్యప్రదేశ్ మంద్‌సౌర్ జిల్లాలో ఘటన
► పోలీసు కాల్పుల్లోనే చనిపోయారన్న ఆందోళనకారులు
► కాల్పులు జరపలేదంటున్న పోలీసులు
► మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో మంగళవారం రైతులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పిపాల్యా మండీ పోలీస్ పరిధిలోని పార్శ్వనాథ్ ప్రాంతంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు రైతులు మృతిచెందారు. పోలీసులు కాల్పులు జరపడం వల్లే వీరు చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే తాము అసలు కాల్పులే జరపలేదని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వి, వాహనాలను తగలబెట్టారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ ఎస్.కె. సింగ్ వెల్లడించారు. ‘కాల్పులు జరపలేదని పోలీసులు నాకు చెప్పారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరుగుతోంది. నివేదిక వచ్చాక వివరాలు తెలుస్తాయి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తాం’ అని తెలిపారు. మృతులను కన్హయ్యలాల్ పటీదార్, బబ్లూ పటీదార్, అభిషేక్ పటీదార్, చైన్ సింగ్ పటీదార్, సత్యనారాయన్‌గా గుర్తించారు. అభిషేక్, సత్యానారాయన్‌లను చికిత్స కోసం ఇండోర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని రాష్ట్ర పటీదార్ సమాజ్ అధ్యక్షుడు మహేంద్ర సింగ్ తేల్చిచెప్పారు.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్..
పశ్చిమ మధ్యప్రదేశ్ రైతులు తమ పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని, రుణాలను మాఫీ చేయాలని ఈ నెల 1 నుంచి ఉద్యమిస్తున్నారు. పిపాల్యా మండీలోని పార్శ్వనాథ్‌లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకుంది. పాపిల్యాలో కర్ఫ్యూను, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పొరుగున ఉన్న రత్లాం జిల్లాలోనూ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
ఇండోర్‌లో తమపై రాళ్లు రువ్విన రైతులను పోలీసులు లాఠీచార్జీతో చెదరగొట్టారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. వదంతులు వ్యాపించకుండా మంద్‌సౌర్, రత్లాం, నీముచ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ధర్ జిల్లాలో రైతులు ఇండోర్–అహ్మదాబాద్ జాతీయ రహదారిని మూడు గంటలపాటు దిగ్బంధించారు. రత్లాం జిల్లాలో ఆదివారం ఇద్దరు పోలీసులు గాయపడిన ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న రైతు నాయకుల ఆచూకీ తెలిపితే బహుమానం ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
విపక్షాలు రెచ్చగొడుతున్నాయి: సీఎం
రాష్ట్రంలో విపక్షాలు హింసను ఎగదోస్తున్నాయని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఆయన రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పిపాల్యా మండీలో పోలీసులుగాని, సీఆర్‌పీఎఫ్ జవాన్లుగాని కాల్పులు జరపలేదని రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ‘వివరాలు తెలుసుకుంటున్నాం. గుంపు లోపలి నుంచి ఎవరైనా కాల్పులు జరిపి ఉండే అవకాశముంది. అందుకే దర్యాప్తునకు ఆదేశించాం’ అని చెప్పారు, మంద్‌సౌర్, నీముచ్ జిల్లాల్లో కొన్ని రోజులుగా సంఘవిద్రోహ శక్తులు హింసను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్
రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం శివరాజ్ సింగ్‌కు ఈ ఘటన సిగ్గుచేటు అని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల గొంతు నొక్కడానికి తూటాలు ప్రయోగిస్తోందని మండిపడ్డారు. మంద్‌సౌర్ ఘటనపై కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర చరిత్రో ఇది చీకటి రోజు అని, బీజేపీ ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా కాల్పులకు దిగుతోందని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. కాంగ్రెస్ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.
తూటాలు తినిపిస్తున్నారు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రైతులపై యుద్ధం చేస్తూ వారికి తూటాలను తినిపిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘బీజేపీ చెబుతున్న నవ భారత్‌లో హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు తూటాలు ప్రతిఫలంగా దక్కుతున్నాయి’ అని ట్వీట్ చేశారు.