రష్యాకు తలపోటుగా మారిన ఆయిల్ లీకేజీ
మాస్కో : ఆర్కిటిక్ తీరంలో భారీ చమురు ట్యాంకు కుప్పకూలిన ఘటన రష్యాకు పెద్ద తలపోటుగా మారింది. దాదాపు 20వేల టన్నుల డీజిల్ మంచి నీటి నదుల్లో కలవటంతో ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే అత్యవసర పరస్థితిని ప్రకటించింది. అత్యవసర విభాగాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. నదిపై తెట్టెలుగా తేలిన చమురును తొలగించటానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక బృందాలు ఇప్పటికే 23వేల క్యూబిక్ మీట్లర్లలోని చమురును తొలగించాయి. పెనుగాలుల ప్రభావంతో నదిలోని చమురు వేగంగా విస్తరిస్తుండటం సహాయక సిబ్బందికి మరింత తలనొప్పిగా మారింది. ( కేసులు 70 లక్షలు..మృతులు 4 లక్షలు...)
ఘటన జరిగిన ప్రదేశానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న డల్‌డైకాన్, అంబర్నాయ నదుల్లోకి చమురు వ్యాపించింది. చమురు లీకేజీని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నోరిల్స్క్ నికెల్ ఆయిల్ ప్లాంట్‌పై చర్యలకు సిద్ధమైంది. దేశ అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో అధికారులకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. నికెల్ కంపెనీ మాత్రం తాము సరైన సమయంలో అధికారులకు సమాచారం ఇచ్చామని చెబుతుండటం గమనార్హం.( బర్త్‌డే పార్టీ: వ్యక్తికి తీవ్ర గాయాలు)
కాగా, ప్రపంచ ప్రఖ్యాత చమురు సంస్థ నోరిల్స్క్ నికెల్కు చెందిన ఆర్కిటిక్ ప్రాంతంలోని ప్లాంటులో ఓ చమురు ట్యాంకు గత నెల 31న కుప్పకూలింది. దీంతో ట్యాంకులోని 20వేల టన్నుల చమురు కొద్దికొద్దిగా లీకవుతూ అక్కడికి దగ్గరగా ఉన్న డల్‌డైకాన్, అంబర్నాయ నదులలో కలిసింది. అంబర్నాయ నదిలో చమురు ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 12మైళ్ల మేర చమురు వ్యాపించింది. లీకేజీ కారణంగా వాతావరణంలో సైతం మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.