నూనె మిల్లులపై దాడులు
నరసరావుపేట/తెనాలి రూరల్/భవానీపురం (విజయవాడ పశ్చిమ)/గుంటూరు (మెడికల్): ఆహార పదార్థాల కల్తీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోను, విజయవాడలోను ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు జరిపాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నూనె మిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ శాఖ, పౌర సరఫరాలు, తూనికల, కొలతల శాఖల అధికారులు బుధవారం దాడులు జరిపారు. కొబ్బరి, వేరుశనగ, సన్‌ప్లవర్ ఆయిల్స్‌ను రీ ప్యాకింగ్ చేస్తున్న మిల్లుల్లో రూ.4.51,665 విలువైన 3,152 లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేసి, ఏడు శాంపిళ్లను సేకరించినట్టు ఆహార కల్తీ నియంత్రణ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్ తెలిపారు. కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆహార వివిధ శాఖల అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పడి ఆయిల్ మిల్లులపై నిర్వహించామని ఆయన చెప్పారు. సత్తెనపల్లి రోడ్డులోని కనకదుర్గ ఇండస్ట్రీస్‌లో రూ.77,765 విలువ చేసే 480 లీటర్ల వేరుశనగ నూనె ప్యాకెట్లను, కోటప్పకొండ రోడ్డులోని వెంకటలక్ష్మి ట్రేడర్స్ మిల్లులో రూ.3,28,900 విలువైన 2,192 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను, హోం గాయత్రి ఇండస్ట్రీస్‌లో హెల్దీ ఆయిల్ కమ్ హెల్దీ లైఫ్ అని రాసిన రూ.45 వేల విలువైన 480 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. సత్తెనపల్లి రోడ్డులోని బొడ్డు నాగేశ్వరరావుకు చెందిన ధనలక్ష్మి నీమ్ ఆయిల్ మిల్లు, దివ్య నాగసాయి ఆయిల్ మిల్లులో వేరుశనగ నూనె, ఆంజనేయ ట్రేడింగ్ కంపెనీలో కొబ్బరినూనె శాంపిల్స్ సేకరించామన్నారు.
నూనె తయారీ కేంద్రాలపై కేసులు
ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తెనాలిలోని నూనె తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీనివాస ఆయిల్ అండ్ ప్రొవిజన్స్ సంస్థపైన, పూజ అండ్ నంది దీపారాధన తైలం తయారీ సంస్థపైనా కేసు నమోదు చేశారు.
విజయవాడలో కొనసాగిన దాడులు
విజయవాడ నగరంలో చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగాయి. భవానీపురం గాం«దీ»ొమ్మ రోడ్‌లోని వెంకటదుర్గ, మహేశ్వరి డాల్ మిల్స్‌పై ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. రెండు మిల్లులలో రూ.3 లక్షల విలువైన పెసరపప్పు బస్తాలను సీజ్ చేసి నమూనాలను సేకరించారు. మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని రాకేష్ ట్రేడర్స్ ఆయిల్ కంపెనీ రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న విడి నూనెను, నూనె ప్యాకెట్ల నమూనాలను సేకరించారు. భవానీపురం ఐరన్ యార్డ్‌లో పప్పు ధాన్యాల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. దాల్ మిల్స్‌లోని పెసరపప్పులో నిషేధిత రంగు కలుపుతున్నట్టు గుర్తించామన్నారు.
కల్తీ చేసే వారిపై చర్యలు తప్పవు..
నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం .. హాహాకారం’, ‘బయో మాయా’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ వివేక్‌యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లలో మాంసం కల్తీ ఎక్కువగా జరుగుతోందని, మునిసిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కల్తీ పురుగు మందులు, విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.