వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్‌డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్‌డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్‌గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్‌లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్‌డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్‌ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్‌డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్‌డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్‌ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్‌లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్‌తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్