ఓ తాగుబోతు తల్లి నిర్వాకం
అమెరికాలోని ఒక్లహామా.. హైవేలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. స్టేట్, ఇంటర్ స్టేట్ అన్నీ కలుపుకుంటే అక్కడి హైవేల సంఖ్య 500పై మాటే! వాటన్నింటిలోకి 1వ నంబర్ హైవేను అత్యంత ప్రమాదకమైనది. ప్రతి ఫర్లాంగ్ కు ఓ భయంకరమైన మూలమలుపు పొంచిఉంటుందా దారిలో! అలాంటి గండరగండ 4 లేన్ రోడ్డుపై.. సీట్లో కూర్చుంటే కనీసం బ్రేకులు కూడా అందని ఓ మూడేళ్ల బాలుడు కారు నడిపాడు. రికార్డు కోసం కాదు.. ప్రాణాలు నిలుపుకునేందుకు. అసలేం జరిగిందంటే..
అదా నగరానికి చెందిన టాలో ఫాస్టర్ (33) అనే మహిళ తన ఇద్దరు కొడుకుల (మూడేళ్ల కవలలు)తో కలిసి ఒక్లహామా సిటీకి బయలుదేరింది. డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కారులో నుంచి కిందికి పడిపోయింది ఫాస్టర్! లోపలున్న ఇద్దరు పిల్లలూ తల్లి పడిపోవటం, స్టీరింగ్ స్వేచ్ఛగా తిరుగుతుండటం గమనిస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు.. డ్రైవింగ్ సీట్ పై నిల్చుని స్టీరింగ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రోడ్డు పక్కనుండే మట్టిగడ్డను ఢీకొట్టించి కారును ఆపాడు. అటుగా వచ్చిన వేరే కార్లు.. పిల్లాడు డ్రైవింగ్ సీట్లో ఉండటాన్ని గమనించి హైవే పెట్రోలింగ్ పోలీసులకు కబురందించారు. దర్యాప్తులో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి..
టాలో ఫాస్టర్ పూటుగా మద్యం సేవించి మత్తులోకి జారుకోవడం వల్లే కారులో నుంచి కిందపడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. అందుకు సాక్ష్యంగా ఆమె తాగిన మందు బాటిళ్లను కారులో నుంచి స్వాధీనం చేసుకున్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే కాక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా ఆమెపై నమోదయింది. అక్టోబర్ 21న ఈ సంఘటన జరిగింది. కోర్టులో జడ్జి చేత చివాట్లు తిన్న ఫాస్టర్ ప్రస్తుతానికి బెయిల్ పై విడుదలైంది. అయితే పిల్లల్ని మాత్రం ఆమెకు అప్పగించేందుకు కోర్టు అంగీకరించలేదు. తుది తీర్పు వచ్చేదాకా పిల్లలిద్దరినీ అమ్మమ్మా తాతయ్యల సంరక్షణలో ఉంచాలని ఆదేశాలు జారీచేసింది.