పోలీసుల అదుపులో పాత నేరస్తుడు మృతి
-పట్టుకునేందుకు ప్రయత్నిస్తే కొంగల మందు తాగాడన్న పోలీసులు
-విచారణ తీరు తాళలేకే అంటున్న బంధువులు
విజయవాడ: కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ఉన్న ఓ పాత నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గన్నవరం పట్టణానికి చెందిన హౌసింగ్ డిపార్టుమెంట్ ఉద్యోగి కుమారుడైన పుల్లా రమేష్ అలియాస్ వెంకట రమేష్ (28) పాత నేరస్తుడు. మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్కు వచ్చిన సమాచారం మేరకు ఎస్.ఐ. వెంకటరమణ సిబ్బందితో కలిసి కానూరు మురళీనగర్కి చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాత్రి 11.30 గంటలకు రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వెంట తెచ్చుకున్న కొంగల మందు మింగాడు. పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
బంధువుల ఆరోపణలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో రమేష్‌ను అదుపులోకి తీసుకుని పెనమలూరు పీఎస్‌కు తరలించారు. గొలుసు చోరీలపై పోలీసు విచారణ తాళలేక రాత్రి 11 గంటల సమయంలో విషం తీసుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిస్థితి వివరించడంతో ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. కుటుంబ సభ్యులు మాత్రం నోరు విప్పేందుకు సాహసించడం లేదు. జరిగిన సంఘటనపై పటమట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో వైద్యుల బృందంతో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
అర్ధరాత్రి నుంచే హైడ్రామా
రమేష్ ఆత్మహత్యపై మంగళవారం అర్ధరాత్రి నుంచే హైడ్రామా చోటు చేసుకుంది. నగర డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్, అదనపు డీసీపీ (క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు సహా పలువురు ఉన్నతాధికారులు, అధికారులు పడమట పోలీసు స్టేషన్లో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం మరోమారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా మొదలు పోస్టుమార్టం పూర్తయ్యే వరకూ అధికారులు అక్కడే ఉండి కుటుంబ సభ్యులు, బంధువుల కదలికలపై నిఘా పెట్టారు. ఇదే సమయంలో కమిషనరేట్ నుంచి రమేష్ నేరాల చిట్టాను ఉటంకిస్తూ పత్రికా ప్రకటన జారీ చేశారు. దొంగతనాలకు నేతృత్వం వహించే రమేష్ వద్ద కొంగల మందు ఎందుకుందనే దానిపై పోలీసుల నుంచి తగిన సమాధానం లేదు.