దగ్గరుండి దాడులు చేయిస్తారా ?
పాతబస్తీ ఘటనలపై గవర్నర్ నరసింహన్ సీరియస్
ప్రజాప్రతినిధులు దాడులకు ప్రోత్సహించడమేంటని ఆగ్రహం
బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశం
ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకున్నామని కమిషనర్ వివరణ
సకాలంలో స్పందించడం వల్లే గొడవలు నివారించగలిగామని వెల్లడి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : జీహెచ్ఎంసీ ఎన్నికల రోజున పాతబస్తీలో చోటు చేసుకున్న విధ్వంసకర ఘటనలపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయ్యారు. ప్రత్యేకించి ఒక పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు దగ్గరుండి ఇతర పార్టీల నేతలపై దాడులు చేయించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై పాతబస్తీలో ఎంఐఎం దాడులు చేయడంపై వంటి ఘటనలను కాంగ్రెస్ నేతృత్వంలో అఖిలపక్షం బుధవారం సాయంత్రం గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దీనిపై ఒక నివేదిక సమర్పించాలని గవర్నర్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. గురువారం ఉదయం పోలీసు కమిషనర్ రాజ్‌భవన్‌కు వెళ్లి దాదాపు గంటసేపు పాతబస్తీలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. ముందు జాగ్రత్తగా పాతబస్తీలో బలగాలను మోహరించామని, అందువల్లే రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య గొడవలను నివారించగలిగామని వివరించారు.
జరిగిన ఘటనలు అప్పటికప్పుడు చోటుచేసుకున్నవేనని, అయినా వెంటనే స్పందించి పెద్దవి కాకుండా నివారించగలిగామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పాతబస్తీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లడానికి కారకులైన అందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తాయి
జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై గవర్నర్ మనస్తాపం చెందారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తాయని ఆయన ఆవేదన చెందినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎంఐఎం ఫిర్యాదు మేరకు పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థిని అదుపులోకి తీసుకోవడంపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఓట్ల లెక్కింపు రోజు రీపోలింగా?
పురానాపూల్ డివిజన్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పోలింగ్ రోజే కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ డివిజన్ లలో పలుచోట్ల విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం, రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడం.. అన్నీ వరుసగా జరిగిపోయాయి.
అదేరోజు రాత్రి అక్కడి ప్రిసైడింగ్ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం బుధవారం అర్ధరాత్రి దాకా ఒక నిర్ణయానికి రాలేదు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే రీ పోలింగ్ జరపడానికి వీలుగా.. ఓట్ల లెక్కింపును పోలింగ్ ముగిసిన మూడో రోజు చేపడుతారు.
కానీ ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు రోజునే రీ పోలింగ్ జరపాల్సి రావడం వెనుక ఏదో మతలబు ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నుంచి అనుమతి కోసం ఎన్నికల సంఘం వేచి చూడటం వల్లే ఈ జాప్యం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు.