గుట్టు రట్టవుతుందా?
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్ : ట్రాన్స్ఫార్మర్లలో వినియోగించాల్సిన, వినియోగించిన పాత కాపర్ తీగను స్టోర్ రూమ్‌లో భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో మాత్రమే కాపర్ ఉంటుంది. 200 కేవీ, 160 కేవీ,100 కేవీ, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో అల్యూమినియం ఉంటుంది. మరమ్మతుల తర్వాత ట్రాన్స్ఫార్మర్ల నుంచి తీసిన కాపర్‌ను, అల్యూమినియంను అమ్మాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి.
అసలు అమ్మడం సాధ్యం కాని పని. ఇక్కడి అధికారు లు మాత్రం చాలా సులువుగా వాటిని అమ్మేశారు. పాత కాపర్ వైరు 40 ట న్నులు, అల్యుమినియం 70 టన్నులు స్టోర్ రూమ్‌లో ఉన్నట్లు అధికారులు ఈ నెల 24న ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఎన్పీడీసీ ఎల్ సీఎండీ ఇదే విషయమై ఒక ఏడీఏ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
వివరాలు చెప్పరట
అసలు లెక్కపత్రం తేల్చడానికి ఎస్ఈ ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు. స్టోర్‌లో ఉన్న కాపర్‌ను, అల్యూమిని యాన్ని తూకం వేయించారు. వివరాలు చెప్పడానికి మాత్రం జంకుతున్నారు. అదేమంటే ఇంకా లెక్కలు జరుగుతున్నాయంటూ తప్పించుకుంటున్నారు. నిందితులు దాదాపు 20 టన్నుల కాప ర్, 20 నుంచి 30 టన్నుల వరకు అల్యూమినియాన్ని అమ్ముకున్నట్టు సమాచారం.
ఒక్క కిలో కాపర్ రూ.300 నుంచి రూ. 400 వరకు ఉంటుంది. అల్యూమినియం రూ. 150 నుంచి రూ. 170 వరకు ఉంటుంది. దీని ప్రకారం మాయమైన తీగ విలువ దాదాపు రూ. 60 లక్షలు ఉంటుంది. ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సాగుతున్న లెక్కలు?
అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో విచారణ జరిపి రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించినా బేఖాతరు చేశారు. ఇంకా లెక్కలు పూర్తి కాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి ఈ నెల 27 వరకే తీగల తూకాలు పూర్తి అయ్యాయి. వివరాలను మాత్రం బయటకు రానివ్వడం లేదు. కమిటీ సభ్యులను అడిగితే ఎస్ఈని అడగమంటున్నారు. ఆయన నోరు విప్పడం లేదు.
భయపడుతూనే
ఈ వ్యవహారం మీద సీఎండీ కార్తికేయ మిశ్రా సీరియస్‌గా ఉన్నారని తెలిసి జిల్లా స్థాయి అధికారులు భయపడుతూనే, చేయాల్సింది చేస్తున్నారు. అక్రమార్కులను కాపాడడానికి స్టోర్ రూమ్ లో మాయమైన కాపర్‌ను గుట్టుచప్పు డు కాకుండా తిరిగి అక్కడ పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం మహారాష్ట్రలో పాత కాపర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న ట్లు సమాచారం. సీఎండీ ప్రత్యేక విచారణ జరిపితేనే ఈ విషయం తేలేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు.