old man dead
-
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్‌తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్‌ను.. ఈసీ కోడ్ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్ర కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మూడో తేదీన ఫించన్ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్ మృతిపై చలించిపోయిన సీఎం జగన్.. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే చేసిన కుట్రతో వలంటీర్లు ఫించన్ పంపిణీకి దూరమైయ్యారు. వలంటీర్ల ఫోన్ లు వెనక్కి ఇచ్చేయడంతో సమాచారం లేక వెంకట్రావు సచివాయాలనికి బయలు దేరాడు. మార్గ మధ్యలో గుండె ఆగి చనిపోవడం విషాదకరం. వెంకట్రావ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అని కురసాల కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. తిరుపతిలో మరో వృద్ధుడు.. తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. మరోపక్క.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వలంటీర్లు అంటున్నారు. -
బ్రేక్ వేయబోయి వృద్ధుడిని బలిగొని..
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్ నేర్చుకుంటున్న యువతి బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్ నొక్కడంతో ఎదురుగా వస్తున్న వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. కీర్తి వల్లభ్ అనే 72 సంవత్సరాల వృద్ధుడు వాకింగ్ చేస్తుండగా సంతోషి దేవి (29) అనే మహిళ డ్రైవింగ్ చేస్తూ కారు అదుపుతప్పడంతో వృద్థుడిపైకి దూసుకెళ్లింది. వల్లభ్ చేతులు పైకెత్తి ఆమెను వారించినా తొందరపాటులో బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్‌ను ప్రెస్ చేయడంతో వాహనం ఆయనను ఢీ కొంది. ఈ ఘటనలో వల్లభ్ మరణించగా సంతోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మరణానికి కారణమయ్యారనే ఆరోపణలు నమోదు చేశారు. కారు ఆమె భర్తది కావడంతో ఆయనపైనా పోలీసులు చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రేక్ వేయబోయిన తాను భయంతో ఎక్సలేటర్‌ను ప్రెస్ చేసినట్టు విచారణలో సంతోషి దేవి పోలీసులకు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వల్లభ్ కుమార్తె ఇంట్లో లేరని, పోలీసులకు ఎవరూ సమాచారం అందించలేదని సమాచారం. ఇరుగుపొరుగు వారు తనకు ఫోన్ ద్వారా సమాచారం అందచేయడంతో భర్తతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నామని వల్లభ్ కుమార్తె చెప్పారు.ప్రమాదంలో గాయపడిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించడంతో సంతోషి దేవిని పోలీసులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. -
రాజప్ప రాజ్యంలో.. రౌడీయిజం
గురువారం ఉదయం..సుమారు 20కి మందికి పైగా ఉన్న రౌడీల మూక.. ఆ వీధికొచ్చింది. ఒక్కసారిగా ఓ ఇంటిపైకి కర్రలు, ఆయుధాలతో దాడికి దిగింది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి అంతా బీభత్సం సృష్టించింది. ఈ పరిణామంతో ఆ ఇంటిలో ఉన్న ఓ వృద్ధుడు, ఇతర కుటుంబసభ్యులు భయంతో వణికిపోయారు. వృద్ధుడు ఆ వీధిలో పరుగులు తీస్తూ.. ‘కాపాడండి.. రక్షించండి’’ అంటూ అందరినీ పిలుస్తూ స్పృహ తప్పిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు ప్రాణాలొదిలాడు. మరోవైపు అతడి మనుమరాలు నిండుగర్భిణి ఈ సంఘటన చూసి ఆందోళన చెంది తీవ్ర పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫ్యాక్షన్ గొడవలను తలపించేలా జరిగిన ఈ సంఘటన సాక్షాత్తూ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం పెద్దాపురం పట్టణంలో చోటుచేసుకుంది. దీంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మేనల్లుడు, మేనమామల మధ్య నెలకొన్ని ఆస్తి తగాదాలే∙ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం.. పెద్దాపురం:బొమ్మల గుడి వీధికి చెందిన దాసరి అప్పారావు(75) అతడి వరుసకు మేనల్లుడైన కొత్తపేటకు చెందిన యర్రా నానాజీల మధ్య కొన్నేళ్ల నుంచి ఇంటి వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తేలకపోవడంతో ఎలాగైనా ఇల్లు తనదనిపించుకునేందుకు నానాజీ కొంతమంది కిరాయి రౌడీ మూకలను ఆశ్రయించాడు. ఏదో విధంగా వారితో ఇల్లు ఖాళీ చేయించుకోవాలన్న మేనల్లుడి పథకం ప్రకారం గురువారం ఉదయం కొంతమంది కిరాయి రౌడీలతో ఇంటిపై దాడికి దిగాడు. మేనమామ, మేనల్లుడు, కుటుంబ సభ్యుల మధ్య వివాదం పూర్తిగా ముదరడంతో రౌడీమూకలు వారిపై దాడికి దిగారు. ఈ నేపధ్యంలో అప్పారావు తమ కుమారుడు వెంకటేశ్వరరావు ఇంటి వద్ద లేకపోవడంతో వారితో వాగ్వివాదానికి దిగలేక పోయాడు. భార్య మంగాయ్యమ్మ, కుమార్తెలు కొల్లు వరలక్ష్మి, మనుమరాలు విరోధుల లక్ష్మీప్రియలు మాత్రమే ఉండడంతో ఏమి చేయలేని దుస్థితిలో బెంబేలెత్తి వీధి సందులో అందరినీ పిలుస్తూ కేకలు అరుపులతో సృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ప్రభుత్వాసుపత్రి తరలించేలోపు మృతి చెందాడు. ఈ సంఘటన చూసిన లక్ష్మీప్రియకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను కూడా ప్రభుత్వాసుపత్రికి తరలించగా మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు అప్పారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కృష్ణ భగవాన్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సమాచారం మేరకు నానాజీ , మరో కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
కాశీబుగ్గ/పలాస రూరల్: ఆరోగ్యం బాగోలేదని వైద్యుని వద్దకు వెళుతున్న ఓ వృద్ధుడిని కంటైనర్ రూపంలో మృత్యువు కబళించింది. వైద్యుని వద్దకు వెళ్లేలోపలే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఈ హృదయవిధారక సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. నందిగాం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన పోలాకి తమ్మినాయుడు(72) రోడ్డు ప్రమాదం మృతి చెందారు. ఇతనికి అనారోగ్యంగా ఉండడంతో స్వగ్రామం కాపుతెంబూరు నుంచి మోటారుసైకిల్‌పై కాశీబుగ్గలోని మల్లేశ్వరరావు డాక్టర్ వద్దకు వెళ్లేందుకు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బయలుదేరాడు. అందరి కంటే ముందుగా ఆస్పతికి వెళ్లి వైద్య సేవలు పొందాలని భావించి భార్యతో చెప్పి బయల్దేరాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పారసాంబ గ్రామానికి సమీపంలో కంబిరిగాం కూడలి వద్ద మృత్యువాతపడ్డాడు. కంబిరిగాం జంక్షన్ వద్ద పలాస వైపు వచ్చేందుకు మోటారుసైకిల్‌ను జంక్షన్ దాటించేందుకు ప్రయత్నించగా ఇచ్ఛాపురం నుంచి టెక్కలి వైపు వెళుతున్న కంటైనర్ లారీ తమ్మినాయుడును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. సుమారు 30 మీటర్ల పాటు ఇతడిని కంటైనర్ ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తమ్మినాయుడు మృతి చెందడంతో కంటైనర్ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ అక్కడ నుంచి పరుగులు పెట్టి పరారీ అయ్యారు. విషయం తెలుసుకున్న తమ్మినాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని విలపించారు. మృతుని భార్య, కుమార్తె మృతదేహంపై పడి విలపించడంతో పలువురు కంటతడి పెట్టారు. తమ్మినాయుడు సన్నకారు రైతు, గతంలో కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, నీటిసంఘం అ«ధ్యక్షుడిగా పనిచేశారు. తమ్మినాయుడుకు భార్య మాణిక్యం, కుమారుడు షణ్ముఖరావు, కుమార్తె భారతి ఉన్నారు. కుమారుడు, కుమార్తెకు వివాహాలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు షణ్ముఖరావు కరీంనగర్లో ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో భార్య, పిల్లలు, కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్ఐ ప్రసాదరావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కంటైనర్‌ను పక్కకు తొలగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
నల్గొండ: నల్గొండ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అరవపల్లి మండలం నాగారం గ్రామం వద్ద లారీ ఢీకొని అవిలయ్య(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.