రౌడీ మూకల దాడిలో ధ్వంసమైన ఇల్లు
గురువారం ఉదయం..సుమారు 20కి మందికి పైగా ఉన్న రౌడీల మూక.. ఆ వీధికొచ్చింది. ఒక్కసారిగా ఓ ఇంటిపైకి కర్రలు, ఆయుధాలతో దాడికి దిగింది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి అంతా బీభత్సం సృష్టించింది. ఈ పరిణామంతో ఆ ఇంటిలో ఉన్న ఓ వృద్ధుడు, ఇతర కుటుంబసభ్యులు భయంతో వణికిపోయారు. వృద్ధుడు ఆ వీధిలో పరుగులు తీస్తూ.. ‘కాపాడండి.. రక్షించండి’’ అంటూ అందరినీ పిలుస్తూ స్పృహ తప్పిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు ప్రాణాలొదిలాడు. మరోవైపు అతడి మనుమరాలు నిండుగర్భిణి ఈ సంఘటన చూసి ఆందోళన చెంది తీవ్ర పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫ్యాక్షన్ గొడవలను తలపించేలా జరిగిన ఈ సంఘటన సాక్షాత్తూ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం పెద్దాపురం పట్టణంలో చోటుచేసుకుంది. దీంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మేనల్లుడు, మేనమామల మధ్య నెలకొన్ని ఆస్తి తగాదాలే∙ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం..
పెద్దాపురం:బొమ్మల గుడి వీధికి చెందిన దాసరి అప్పారావు(75) అతడి వరుసకు మేనల్లుడైన కొత్తపేటకు చెందిన యర్రా నానాజీల మధ్య కొన్నేళ్ల నుంచి ఇంటి వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తేలకపోవడంతో ఎలాగైనా ఇల్లు తనదనిపించుకునేందుకు నానాజీ కొంతమంది కిరాయి రౌడీ మూకలను ఆశ్రయించాడు. ఏదో విధంగా వారితో ఇల్లు ఖాళీ చేయించుకోవాలన్న మేనల్లుడి పథకం ప్రకారం గురువారం ఉదయం కొంతమంది కిరాయి రౌడీలతో ఇంటిపై దాడికి దిగాడు. మేనమామ, మేనల్లుడు, కుటుంబ సభ్యుల మధ్య వివాదం పూర్తిగా ముదరడంతో రౌడీమూకలు వారిపై దాడికి దిగారు. ఈ నేపధ్యంలో అప్పారావు తమ కుమారుడు వెంకటేశ్వరరావు ఇంటి వద్ద లేకపోవడంతో వారితో వాగ్వివాదానికి దిగలేక పోయాడు.
భార్య మంగాయ్యమ్మ, కుమార్తెలు కొల్లు వరలక్ష్మి, మనుమరాలు విరోధుల లక్ష్మీప్రియలు మాత్రమే ఉండడంతో ఏమి చేయలేని దుస్థితిలో బెంబేలెత్తి వీధి సందులో అందరినీ పిలుస్తూ కేకలు అరుపులతో సృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ప్రభుత్వాసుపత్రి తరలించేలోపు మృతి చెందాడు. ఈ సంఘటన చూసిన లక్ష్మీప్రియకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను కూడా ప్రభుత్వాసుపత్రికి తరలించగా మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు అప్పారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కృష్ణ భగవాన్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సమాచారం మేరకు నానాజీ , మరో కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment