సచిన్ కానుక కన్నా నాకు అదే గొప్ప!
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించి.. దేశ ప్రజల నిరీక్షణకు తెరదించింది సాక్షి మాలిక్. ఓ సాధారణ బస్సు డ్రైవర్ కూతురు అయిన సాక్షి జీవితం రియో పతకంతో పూర్తిగా మారిపోయింది. రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన ఆమెకు దేశ నీరాజనాలు పట్టింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు నజరానాను ఆమెకు ప్రకటించాయి.
హర్యానాలో అయితే ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో హర్యానా ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. హర్యానా ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది.
ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా సాక్షితోతోపాటు షట్లర్ సింధు, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపీచంద్‌కు బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందాయి. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ వారికి సచిన్ చేతులమీదుగా ఈ కార్లను బహూకరించారు.
ఖరీదైన బీఎండబ్ల్యూ కారు సాక్షికి కానుకగా అందినా తాను మాత్రం ఓల్డ్ పోలో కారులోనే ప్రయాణిస్తుందట. అందుకు కారణం.. 'రెండేళ్ల కిందట మా నాన్న బ్లూకలర్ ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును కానుకగా ఇచ్చారు. ఈ కారు ఇచ్చిన తర్వాత నేను గ్లాస్గో కామన్వెల్గ్ క్రీడల్లో రజత పతకాన్ని గెలిచారు. ఇక ముందు కూడా ఇదే కారును వాడుతాను. బీఎండబ్ల్యూను మా నాన్నకు కానుకగా ఇస్తాను. ఆయన నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు' అని సాక్షి చెప్పింది. ఎంతైనా బీఎండబ్ల్యూ కన్నా కన్నతండ్రి ఇచ్చిన కానుకే గొప్పది కదా!