చక్రాలే చెయిర్లైతే...
మనసుండాలే కానీ... మనిషి తెలివికి, ప్రతిభకి ఎలాంటి కొలమానం సరిపోదు. ఎందుకంటారా? ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే మీకే అర్థమవుతుంది. మొదటగా టైర్లను అసలు ఎందుకు తయారు చేశారు? వాహనాల కోసం. అవునా, మరి అవి పాడయితే ఎలా? వాటిని ఎలాగూ వాహనాలకు అమర్చలేం.. ఇక్కడే మనిషి తెలివి ఉపయోగపడేది. ఆ పాడైన టైర్లను కుర్చీలు, బల్లలు, సెంటర్ టేబుల్స్‌గా తయారు చేసి వాడుకోవచ్చు.
కావలసినవి: పాత టైరు, దళసరి కార్డ్‌బోర్డు, నాలుగు కాళ్ల పీట, జనపనార, గ్లూ
తయారీ: ముందుగా సెంటర్ టేబుల్ తయారీకి... కార్డ్‌బోర్డు ముక్క టైరు సెంటర్ హోల్ సైజుకు అనుగుణంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్లూతో ఆ కార్డ్బోర్డును టైరుకు అతికించాలి. తర్వాత టైరుకు పూర్తిగా గ్లూను పూయాలి. ఇప్పుడు జనపనారను టైరు చుట్టూ చుట్టాలి. గ్లూ రాశాం కాబట్టి.. చుట్లు ఊడిపోవు. తర్వాత ఈ టైరును నాలుగు కాళ్ల పీటపై పెట్టి అతికించాలి. ఇప్పుడు ఈ సెంటర్ టేబుల్‌ను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే జనపనార చుట్టకుండా కూడా వీటికి ఏదైనా రంగు వేసి, వాటిపై కార్డ్‌బోర్డు లేదా గ్లాస్ బోర్డు పెట్టి సెంటర్ టేబుల్‌గా వాడుకోవచ్చు. అంతేనా ఫొటోలో కనిపిస్తున్న విధంగా చెయిర్, సోఫాల్లా మార్చుకోవచ్చు.