Oldage women
-
అమ్మ చావలేదు..చంపాడు..!
సాక్షి, రాజంపేట: పెనగలూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఊటుకూరు సిద్ధమ్మ (85)ను హత్య చేసిన కేసులో తనయుడు ఊటుకూరు రామచంద్రారెడ్డి, మనవడు గిరిధర్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ మురళీధర్ తెలిపారు. బుధవారం రాత్రి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నరసింహులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దమ్మను ఆమె చివరి కొడుకు రామచంద్రారెడ్డి హత్య చేసి, తన కొడుకు గిరిధర్‌రెడ్డి సహాయంతో కువైట్‌కు వెళ్లిపోయేందుకు ఇన్నోవా వాహనంలో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ వారిని విమానంలో ప్రయాణం చేయకుండా నిలుపుదల చేశారు. దీంతో వారిని అక్కడ అరెస్టు చేశారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి భర్త 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. సిద్ధమ్మ వయోభారంతో పాటు అనారోగ్యంతో మంచంపైనే జీవనం సాగిస్తోంది. గత మూడు నెలలుగా రామచంద్రారెడ్డితోపాటు అన్నదమ్ములు అందరు ఒక్కొక్కరు ఒక నెల చొప్పున తల్లిని చూసుకునే విధంగా అంగీకారం చేసుకున్నారు. రామచంద్రారెడ్డి వద్ద సిద్ధమ్మ ఉండే సమయంలో ఆమెను ఎంత బాగా చూసుకున్నప్పటికి కొడుకు, కోడలు సరిగా చూసుకోలేదని కనిపించిన వారికి చెబుతూ వచ్చేది. దీంతో తల్లిపై తనయుడు కోపం పెంచుకున్నాడు. ఈనెల 4న రాత్రి సుమారు 12.50 గంటల ప్రాంతంలో సిద్ధమ్మ ముఖంపై గుడ్డతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి గొంతు నులిమి చంపేశాడు. తల్లి చనిపోయిన తర్వాత తన తల్లిది సహజ మరణం అని అన్నదమ్ములందరిని నమ్మించాడు. అందరితో కలిసి ఆమె కర్మకాండలను జరిపించాడు. నేర స్థలానికి ఎదురుగా ఉన్న యశోదమ్మ ఇంట్లో గల సీసీ కెమెరా పుటేజీలను చూస్తే, తన నేరం బయటపడుతుందని రామచంద్రారెడ్డి భయపడి బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా కువైట్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ కంట్రోల్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వివరించారు. సమావేశంలో పెనగలూరు ఎస్ఐ వెంకటరమణ , సిబ్బంది పాల్గొన్నారు. ఆ అమ్మకు రోజూ చిత్రహింసలే పెనగలూరు : కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన మాతృమూర్తి సిద్దమ్మ బతికి ఉన్నన్ని రోజులు కొడుకులు, కోడళ్ల చేతిలో చిత్రహింసలకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం కాగా ఒక్కో కుమారుడు ఒక్కో నెల చూసుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే కొంతమంది కోడళ్ల వంతు వచ్చినప్పుడు వారుపెట్టే చిత్రహింసలు చూసి చుట్టు పక్కల వాళ్లు చలించిపోయేవారని తెలిసింది. ఒక కోడలు ఏకంగా కట్టె తీసుకుని ఆమెను కొట్టిన విషయం సీసీ పుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కసారి వృద్ధురాలు ఏడుస్తున్నా కొట్టిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిందితుడు రామచంద్రారెడ్డి -
ఎన్నాళ్లీ పింఛన్ల వెతలు ?
- 12వ తేదీకీ అందని వైనం - అల్లాడిపోతున్న అభాగ్యులు - మూడు నెలలుగా ఇదే తంతు - వైఎస్ పాలనలో ఒకటో తేదీనే పింఛన్ చల్లపల్లి : ‘అవనిగడ్డ మండలం బందలాయిచెరువు దళితవాడకు చెందిన గొర్రుముచ్చు దుర్గమ్మ అనే వృద్ధురాలికి పదో తేదీ దాటినా ఫించన్ అందక పోవడంతో మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక మంచానపడింది’.'చల్లపల్లికి చెందిన సరోజనమ్మ అనే వృద్ధురాలు ఫించన్‌కోసం ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లి విసిగి వేసారిపోయి ఉసూరుమంటూ రోదిస్తూ తిరిగొస్తుంది. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫించన్‌తో మందులు కొనుక్కుని బతికీడుస్తున్నవారు కొందరైతే, వాటితో పచ్చడి మెతుకులు తిని కడుపు నింపుకుంటున్నవారు మరికొందరు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ అందుకునే అభాగ్యులు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో పదోతేదీ దాటినా పింఛన్ అం దక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు నెలల నుంచి ఇదేతంతు... జిల్లాలో మొత్తం 3,12,028 మంది పింఛన్‌దారులున్నారు. వీరిలో 1,25,350 మంది వృద్ధాప్య, 1,15,686 మంది వితంతు, 44,838 వికలాంగ, 4,946 మంది చేనేత, 1,935 మంది కల్లుగీత, 20,273 మంది అభయహస్తం పింఛన్ దారులున్నారు. వీరికి ప్రతినెలా రూ.12,18,79,700 సొమ్ము ఇస్తున్నారు. ఈనెల 12వ తేదీ దాటినా పింఛన్ ఇవ్వకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి ఇదే తంతు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరిగా స్పందించక పోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగస్తుల మాదిరి ఒకటో తేదీన పింఛన్లు అందుకునేవారమని, గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో మూడు నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చేవారని, మళ్లీ అవే రోజులు పునరావృతమవుతున్నాయని కొంతమంది వృద్ధులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మందులు ఆపేశాను అనారోగ్యంతో బాధపడుతున్న నేను ప్రతి నెలా తప్పనిసరిగా మందులు వాడుతుంటాను. ఇంత వరకు పింఛన్ ఇవ్వకపోవడం వల్ల మందులు కొనేందుకు డబ్బులు లేవు. మందులు వేసుకోలేకపోతున్నాను. మందులు వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ ఎప్పుడు ఇస్తారో ఏమో. - గొర్రుముచ్చు దుర్గమ్మ, బందలాయిచెర్వు, అవనిగడ్డ మండలం ప్రతి నెలా ఆలస్యమే.. గత మూడు నెలల నుంచి పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితం పదిహేను రోజులు ఆలస్యంగా ఇచ్చారు. గత నెలలో వారం రోజుల తర్వాత ఇచ్చారు. ఈ నెలలో ఇంత వరకూ ఇవ్వలేదు. మూడు నెలల నుంచి ఇలాగే జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. - వెంపటి శేషమ్మ, కూచిపూడి