ఎన్నాళ్లీ పింఛన్ల వెతలు ?
- 12వ తేదీకీ అందని వైనం
- అల్లాడిపోతున్న అభాగ్యులు
- మూడు నెలలుగా ఇదే తంతు
- వైఎస్ పాలనలో ఒకటో తేదీనే పింఛన్
చల్లపల్లి : ‘అవనిగడ్డ మండలం బందలాయిచెరువు దళితవాడకు చెందిన గొర్రుముచ్చు దుర్గమ్మ అనే వృద్ధురాలికి పదో తేదీ దాటినా ఫించన్ అందక పోవడంతో మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక మంచానపడింది’.'చల్లపల్లికి చెందిన సరోజనమ్మ అనే వృద్ధురాలు ఫించన్‌కోసం ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లి విసిగి వేసారిపోయి ఉసూరుమంటూ రోదిస్తూ తిరిగొస్తుంది. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫించన్‌తో మందులు కొనుక్కుని బతికీడుస్తున్నవారు కొందరైతే, వాటితో పచ్చడి మెతుకులు తిని కడుపు నింపుకుంటున్నవారు మరికొందరు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ అందుకునే అభాగ్యులు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో పదోతేదీ దాటినా పింఛన్ అం దక నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
మూడు నెలల నుంచి ఇదేతంతు...
జిల్లాలో మొత్తం 3,12,028 మంది పింఛన్‌దారులున్నారు. వీరిలో 1,25,350 మంది వృద్ధాప్య, 1,15,686 మంది వితంతు, 44,838 వికలాంగ, 4,946 మంది చేనేత, 1,935 మంది కల్లుగీత, 20,273 మంది అభయహస్తం పింఛన్ దారులున్నారు. వీరికి ప్రతినెలా రూ.12,18,79,700 సొమ్ము ఇస్తున్నారు. ఈనెల 12వ తేదీ దాటినా పింఛన్ ఇవ్వకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి ఇదే తంతు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరిగా స్పందించక పోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగస్తుల మాదిరి ఒకటో తేదీన పింఛన్లు అందుకునేవారమని, గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో మూడు నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చేవారని, మళ్లీ అవే రోజులు పునరావృతమవుతున్నాయని కొంతమంది వృద్ధులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మందులు ఆపేశాను
అనారోగ్యంతో బాధపడుతున్న నేను ప్రతి నెలా తప్పనిసరిగా మందులు వాడుతుంటాను. ఇంత వరకు పింఛన్ ఇవ్వకపోవడం వల్ల మందులు కొనేందుకు డబ్బులు లేవు. మందులు వేసుకోలేకపోతున్నాను. మందులు వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ ఎప్పుడు ఇస్తారో ఏమో.
- గొర్రుముచ్చు దుర్గమ్మ, బందలాయిచెర్వు, అవనిగడ్డ మండలం
ప్రతి నెలా ఆలస్యమే..
గత మూడు నెలల నుంచి పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితం పదిహేను రోజులు ఆలస్యంగా ఇచ్చారు. గత నెలలో వారం రోజుల తర్వాత ఇచ్చారు. ఈ నెలలో ఇంత వరకూ ఇవ్వలేదు. మూడు నెలల నుంచి ఇలాగే జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
- వెంపటి శేషమ్మ, కూచిపూడి