విభజన జరిగితే క్రీడారంగానికి నష్టమే
కాకినాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర క్రీడాలోకానికి తీరని నష్టం వాటిల్లుతుందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు పేర్కొన్నారు. గురువారం జాతీయ క్రీడాదినోత్సవం, ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వరంలో కాకినాడలో రాష్ట్రవిభజన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైడీ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా రంగానికి హైదరాబాద్ గుండె వంటిదన్నారు. సీమాంధ్రలో సరైన క్రీడా వసతులు, స్పోర్ట్స్ అకాడమీలు, మౌలిక వసతులు లేవన్నారు. ఒలింపిక్ సంఘం గౌరవ అధ్యక్షురాలు చిరంజీవినీ కుమారి మాట్లాడుతూ రాష్ట్రవిభజన జరిగితే సీమాంధ్రలో రెండు తరాల క్రీడాకారులు నష్టపోతారన్నారు. ఒలింపిక్ సంఘ కార్యదర్శి పద్మనాభం మాట్లాడుతూ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర ప్రాంతానికి క్రీడల పరంగా జరిగే నష్టాన్ని వివరించామన్నారు. సీమాంధ్రలో క్రీడా వసతుల కల్పనకు సుమారు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. స్థానిక బాలాజీ చెరువు సెంటరులో రోడ్డుపై వాలీబాల్, టెన్నికాయిట్ ఆడి తమ నిరసన తెలిపారు. ‘హైదరాబాద్ అందరిదీ... మాకు హైదరాబాద్ కావాలి’ అంటూ నినాదాలు చేశారు. జిల్లా పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి గోవిందు, మాజీ డీఎస్డీఓ ఎంఏ దీన్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు బంగార్రాజు, స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీనివాస్, పీడీలు తాతబ్బాయి, రంగారావు, పీఈటీలు రవిరాజు, నాగమణి, రాజశేఖర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలోని నాయకులను కలసి తమ సంఘీభావం తెలిపారు.
ఒలింపిక్ సంఘ నివేదికను విజయమ్మకు అందిస్తా : ద్వారంపూడి
రాష్ట్ర విభజన జరిగితే క్రీడల పరంగా సీమాంధ్రకు జరిగే నష్టంపై శ్రీకృష్ణ కమిటీకి జిల్లా ఒలింపిక్ సంఘం అందజేసిన నివేదికను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు స్వయంగా అందిస్తానని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమైక్యాంధ్ర మద్దతు ర్యాలీ కాకినాడ కలెక్టరేట్ వద్ద ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం శ్రీకృష్ణ కమిటీకి నివేదించిన నివేదికను ద్వారంపూడికి అందజేశారు. ఒలింపిక్ సంఘం, వివిధ క్రీడా సంఘాలు సమైక్యాంధ్రపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ద్వారంపూడి ఆవిష్కరించారు. కలెక్టరేట్ వద్ద
ద్వారంపూడి వాలీబాల్ ఆడారు.