వీరులకు బ్రహ్మరథం.. విమానాశ్రయంలో రచ్చ
ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు సోమవారం టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, అదీ స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... రజత, కాంస్య పతకాలు సాధించిన రెజ్లర్లు రవి, బజరంగ్.. కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా... 41 ఏళ్ల విరామం తర్వాత విశ్వ క్రీడల్లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు... నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలో పతక విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. తాను సాధించిన పతకం తన ఒక్కడిదే కాదని, దేశ ప్రజలందరిదని నీరజ్ చోప్రా అన్నాడు.
నీరజ్ చోప్రా, రవి దహియా
బజరంగ్, లవ్లీనా
‘మీరంతా నవతరం హీరోలు...’
► టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలపై ప్రశంసల జల్లు
► స్వదేశంలో ఘన స్వాగతం
► కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన... ప్రపంచాన్ని గెలవాలనుకునే భారత కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మున్ముందు కూడా అన్ని రకాలుగా క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సోమవారం స్వదేశం చేరుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ పూనియా, మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తరఫున ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ... ‘స్వీయ క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో భారత అథ్లెట్లు చూపించారు.
సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతకంతో నీరజ్ చోప్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్; రజతం నెగ్గిన రెజ్లర్ రవి దహియాకు జ్ఞాపికను అందజేస్తున్న అనురాగ్ ఠాకూర్, చిత్రంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
పతకాలు సాధించే వరకు వారి ప్రయాణం చాలా గొప్పగా సాగింది. నవ భారతంలో వీరంతా నవతరం హీరోలు. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై జాతి యావత్తూ సంబరాలు చేసుకుంది. మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అందరినీ ఒక్కచోటికి చేర్చే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. క్రీడల్లో మన దేశం మరింత ఘనతలు సాధించేలా సహకారం అందిస్తాం’ అని ఠాకూర్ అన్నారు. ఒలింపిక్ చరిత్రలో భారత్ ఈసారి ఎక్కువ (7) పతకాలు గెలవడం తనకు చాలా సంతోషం కలిగించిందన్న మాజీ క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశం మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. టోక్యోలో రజత, కాంస్యాలు సాధించి కొద్ది రోజుల క్రితమే భారత్‌కు వచ్చేసిన మీరాబాయి చాను, పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
కేక్ కట్ చేస్తున్న భారత హాకీ జట్టు సభ్యులు
విమానాశ్రయంలో రచ్చ...
టోక్యో విజేతలకు సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ‘సాయ్’ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని తమ ఆటగాళ్లకు ‘వెల్కమ్’ చెప్పారు. అయితే ఈ సందర్భంగా పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. అభిమానులు, ఆటగాళ్ల సన్నిహితులతో విమానాశ్రయం నిండిపోవడంతో బాగా రచ్చ జరిగింది. త్రివర్ణ పతాకాలతో ఎయిర్పోర్ట్ వద్ద డప్పు, ఇతర వాయిద్యాలతో ఫ్యాన్స్ పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం మీద పడిపోతున్న వారి నుంచి తప్పించుకొని బయటకు రావడానికి ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. నీరజ్ పోలీస్ భద్రత మధ్య బయటకు రాగా... బజరంగ్ పూనియా, రవి దహియాలను అతని మిత్రులు భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఒలింపిక్ స్వర్ణం సాధించిన తర్వాత రోజు తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడ్డాను. అయితే నా విజయం ముందు అది చాలా చిన్న విషయం. జావెలిన్ విసిరిన సమయంలో నేను నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని మాత్రమే అనుకున్నాను. అయితే త్రో ఇంకా చాలా దూరం వెళ్లింది. ఈ పతకం నా ఒక్కడిదే కాదు. భారతదేశ ప్రజలందరిది. ప్రత్యర్థి ఎంత బలమైనవాడైనా సరే మన అత్యుత్తమ ఆట ప్రదర్శించాలని, ప్రత్యర్థి గురించి భయపడవద్దని చెబుతా. అదే బంగారు పతకాన్ని తెచ్చి పెట్టింది. నాకూ పొడవాటి జుట్టు ఉంచడమే ఇష్టం. వేడి వల్ల చెమట పట్టి ఇబ్బంది కావడంతో జుట్టు తగ్గించుకున్నా.
– సన్మాన కార్యక్రమంలో నీరజ్ చోప్రా