ఏమి చేస్తే స్థిమితం కలుగుతుంది?
మంచి, చెడు సంఘటనలు జరుగుతూనే ఉండటం మన జీవితాల్లో మామూలే. అయినా చెడునే ఎప్పుడూ తలపోస్తూ ఉంటాం. దీనివల్లనే ఆతురత, ఒత్తిడి, అసహనం, భయం, ఆవేదన వంటి మానసిక ఒత్తిడులకు గురవుతున్నాం. కలతతో కూడిన అవమానకర సంఘటనలనే అనుక్షణం తలచుకుంటూ దుఃఖానికి గురవుతూంటాం. పోనీలే వదిలేద్దాం అనుకున్నా, మన ఎరుక లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కోపతాపాల ఒరవడిలో, భావోద్వేగాల ఒత్తిడిలో ఉన్నప్పుడు మనమేం చేయాలి? ఏమి చేస్తే మనసుకు శాంతి, స్థిమితం కలుగుతాయి?
మనో నిశ్చలతకు ఒక మార్గం... మంత్రం. మంత్రం అంటే మనసును గెలిచేది అని అర్థం. మంత్రాలు మనకు కొత్తేమీ కాదు. వాటిని యుగయుగాలుగా మననం చేస్తూనే ఉన్నాం. లాటిన్ అమెరికన్ చర్చలలో కూడా మరనాథ్ కనిపిస్తుంది. లాటిన్లో, సంస్కృతంలో దానికి ఒకటే అర్థం. లార్డ్ అనే పదాన్ని లాటిన్లో నాథ్ అంటారు. సంస్కృతంలో నాథ్‌కు అర్థం లార్డ్. మరనాథ్ అంటే మై లార్డ్. ఈ సంస్కృత పదాన్ని క్రైస్తవంలో కూడా ఇదే అర్థంతో వాడతారు. జై నం, బౌద్ధం, హైందవం, జొరాస్ట్రియనిజం, సిక్కిజం అన్ని దేశీయ మతాల్లో ఓంకార్ అనే పదాన్ని ఒకటే అర్థంతో వాడతాం. ఓం నమశ్శివాయ అనే మంత్రం మహామంత్రంగా చెప్పబడుతోంది. ఎందుకంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ... అందులో కేంద్రీకృతమై ఉన్నాయి. న అంటే భూమి, మః అంటే నీరు, శి అంటే అగ్ని, వా అంటే వాయువు, య అంటే ఆకాశం. ఓం ఈ అన్నింటి మిళితం.
మంత్రోచ్చారణ చేస్తున్నా కొన్నిసార్లు మనస్సు లగ్నంకాక, పనికిరాని వాటి మీదకు పరుగెడుతుంటుంది. అంగడి తెరిచారో లేదో, భోజనం ఈరోజెవరు వండుతారో... ఇటువంటి పనికిరాని ఆలోచనలు మనస్సులో మెదులుతుంటాయి. కానీ, అభ్యాసం ద్వారా ఏకాగ్రత మెరుగవుతూ వస్తుంది. కొద్దికొద్దిగా మనోనిగ్రహం వృద్ధి చెందుతూ, సంస్కారం కలుగుతుంది. మనస్సును అలాగనే నిలుపుకునే ప్రయత్నాలు కొనసాగించాలి. ఆందోళనల వలయంలో తలమునకలవుతుంటే మనలోని శక్తి తగ్గుతూ వస్తుంది. అటువంటప్పుడు మంత్రో చ్చారణ, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రక్రియలను అవలంబించాలి. మహర్షి పతంజలి యోగశాస్త్రంలో ‘యాది స్థాన సంశయ అవిరాతి ప్రమాద ఆలస్య’ అన్నారు. జబ్బునుండి తప్పించుకోవటానికి ఉత్సాహం లేకుండా ఉండటం, అనుమానితులుగా ఉండటం, ఆందోళన తో గడపటం వంటి వాటిని నిరోధించాలంటే ఏకతత్త్వ అభాస్యమే మార్గం. ఒకేమంత్రం, ఒకే ఉచ్చారణ, ఒకే అక్షరం ఎక్కువమార్లు జపం చేయటం అలవరచుకోవాలి.
ఆలోచనలు, మంత్రం రెండూ మనసులో తిరుగుతున్నప్పుడు మంత్రం మీదనే శ్రద్ధం ఉంచాలి. మంత్రానికి ఉండే అపూర్వశక్తి తరంగాల వలన మనసులోని ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. మంత్రోచ్చారణే మహాశక్తిగా మారుతుంది. కొద్దికాలంలోనే మన ఇల్లు, మనస్సు, దేహం, మన పరిసరాలు మొత్తం అన్నీ శక్తితో నిండిపోయి నిర్మాణాత్మకత ఏర్పడుతుంది.