మాతో పెట్టుకోవద్దు
భారత్‌కు చైనా హెచ్చరిక
బీజింగ్: తైవాన్ విషయంలో ట్రంప్‌తో తాము వ్యవహరించిన విధానాన్ని చూసి నేర్చుకోవాలని భారత్‌ను ఉద్దేశించి చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దారితప్పిన పిల్లాడి లాంటి పనులు మానుకోవాలని భారత్‌ను సున్నితంగా హెచ్చరించింది. మంగోలియాకు భారత్ ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించడాన్ని ఉటంకిస్తూ ఈ కథనం రాసింది. తాము అభ్యంతరం చెప్పినా దలైలామాను మంగోలియా ఆహ్వానించడంపై మండిపడుతున్న చైనా.. గతంలో ఆదేశంపై పలు ఆంక్షలు విధించింది. దీని నుంచి బయటపడటానికి భారత్ సాయం మంగోలియా కోరింది.
గతంలో ‘ఒన్ చైనా’ సూత్రంపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తైవాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. దానిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత దక్షిణ చైనా సముద్రంలో అమెరికా డ్రోన్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. సున్నితమైన విషయాల్లో తమతో తగాదా పెట్టుకోవాలంటే అమెరికాయే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని, తాము తట్టుకోగలమని భావించే భారత్ ధైర్యం ప్రదర్శిస్తోందా అంటూ ఆ పత్రిక వ్యాఖ్యానించింది.