కేసీఆర్ తొలి అడుగే... తప్పటడుగు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చెప్పిన మాయ మాటల్లాగే, కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజలను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు. ‘సీఎం కేసీఆర్ తొలి అడుగే తప్పటడుగు అయింది. లక్ష కోట్ల బడ్జెట్ అయినా, రైతుల శ్రేయస్సును విస్మరించారు.
విద్యుత్తుకు కావాల్సినన్ని నిధుల్లేవు. ఉద్యోగ కల్పన ఊసు మరిచార’ అని పొన్నాల వ్యాఖ్యానించారు. ‘విద్యుత్ రంగానికి కేటాయించింది రూ.1,636కోట్లు... మరి మూడేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తారు’ అని నిలదీశారు. ఈ సమావేశంలో పొన్నాలతో పాటు కిసాన్, ఖేత్ మజ్దూరు కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.