ఎన్డీయే చేతల ప్రభుత్వం
డెహ్రాడూన్: మొక్కుబడిగా కాకుండా చేతల ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాయుధ బలగాల సంక్షేమానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తోందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చాన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ), జాతీయ యుద్ధ స్డ్మారక నిర్మాణం లాంటివి మోదీ చొరవతో కొలిక్కి వచ్చాయని గుర్తుచేశారు. డెహ్రాడూన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో అమర జవాన్ల కుటుంబాలనుద్దేశించి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమైతే మోదీ ప్రభుత్వం చేతలను నమ్ముకుందని తెలిపారు.
బడ్జెట్లో ఓఆర్ఓపీకి రూ.8 వేల కోట్లను కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ..మొక్కుబడి విధానాల స్థానంలో నిజంగా పనిచేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రెండేళ్ల వ్యవధిలో నాలుగు దఫాల్లో ఓఆర్ఓపీ బకాయిలన్నింటిని చెల్లించామని వెల్లడించారు. జవాను అంగవైకల్యాన్ని సాయుధ బలగాల ట్రిబ్యునల్ ధ్రువీకరించిన తరువాత అప్పీల్ చేయకూడదని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. సైనిక సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నవారంతా ఏమైనా సందేహాలుంటే నేరుగా తనను లేదా వారి ఎంపీలనే ప్రశ్నించొచ్చని సూచించారు. అమరులైన 15 మంది జవాన్ల భార్యలు, తల్లులను ఈ సందర్భంగా సన్మానించిన నిర్మలా సీతారామన్, ఓ తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.