ఒకే ఒక్కడు కోసం.. మళ్లీ పరీక్ష!
పరీక్షలంటే ఆషామాషీ కాదు.. ఏడాదంతా చదివిన దానికి ఫలితం తేల్చేదే పరీక్ష..నిర్ణీత తేదీల్లో నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే.. తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిందే..
గైర్హాజరైతే పరీక్ష తప్పినట్లే.. హాజరుకాని వారికి మళ్లీ పరీక్ష పెట్టే అవకాశం లేదు.ఒకవేళ అరుదైన పరిస్థితుల్లో ఎప్పుడైనా మళ్లీ పరీక్ష పెట్టాల్సివస్తే పాత ప్రశ్నపత్రం కాకుండా.. కొత్తది తయారు చేయాల్సిందే..
ఎలిమెంటరీ నుంచి పీజీ స్థాయి వరకు పాటించే పద్ధతి ఇదే..కానీ ఘనత వహించిన మన ఆంధ్ర విశ్వకళాపరిషత్వారు ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చేశారు.ఆశ్రిత పక్షపాతంతో పరీక్షలను ప్రహసనప్రాయంగా మార్చేశారు.కేవలం.. ఒకే ఒక్కడి కోసం.. ఎటువంటి సకారణం లేకుండా.. సదరు విద్యార్థి కోరడమే ఆలస్యమన్నట్లు.. అత్యంత ఉదారంగా ఒక్కరోజు వ్యవధిలోనే పరీక్ష పెట్టారు.అదీ.. రెండు రోజుల క్రితమే జరిగిన అసలు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే.. ఈ ఒకే ఒక్కడికి ఇచ్చి పరీక్ష రాయించారు.అధికార పార్టీ నేతల సిఫారసులతోనే నిబంధనలను మీరి రిజిస్ట్రార్ ఈ ప్రహసనం కానిచ్చేశారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక్కడి కోసం మళ్లీ పరీక్ష పెట్టారా?.. పాత ప్రశ్నపత్రమే ఇచ్చారా?!..ఇది నిజ మా.. ఇంత ఘోరమా.. అనిపించే ఈ ఉదం తం ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏయూ పాలనలోని డొల్లతనం, అవకతవకలు, అస్మదీయుల కోసం ఏదైనా చేసే బరితెగింపుతనాన్ని బట్టబయలు చేసిం ది. ఏయూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం 2014 బ్యాచ్‌కు చెందిన జీఎస్ఎస్ వెంకటేష్‌కు బీటెక్ సెకండియర్‌లో ఎలిమెం ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు మిగిలిపోయింది. మూడేళ్ల నుంచి రాస్తున్నప్పటికీ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న అతన్ని బీటెక్ సర్టిఫికెట్ సమర్పించాలని సదరు సంస్థ ఒత్తి డి చేసింది. దీంతో మిగిలిపోయిన ఒక్క సబ్జెక్టును ఎలాగైనా అయిందనిపించుకోవాలని భావించాడు. ఇదే తరుణంలో స్పెషల్ ఎగ్జామినేషన్ నిర్వహించేం దుకు ఏయూ నోటిఫికేషన్ వెలువరించింది.
వీసీకి తెలియకుండానే..
వాస్తవానికి ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్‌కు సర్వాధికారాలు లేవనే చెప్పాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అలా ఎగ్జామ్ పెట్టాల్సి వస్తే.. వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లి, అనుమతి తీసుకోవాలి. కానీ వీసీకి చెప్పకుండానే.. విద్యార్థి లేఖ ఇచ్చిన మరుసటి రోజే నవంబర్ 4న ప్రత్యేకంగా అతనికి పరీక్ష నిర్వహించారు. ఇంకో దారుణం ఏమిటంటే.. ఒకటో తేదీన జరిగిన అసలు పరీక్షలో ఏ ప్రశ్నాపత్రం ఇచ్చారో.. 4న నిర్వహించిన పరీక్షకు కూడా అదే పేపర్ ఇచ్చారు. వాల్యుయేషన్ సందర్భంలో ఈ వ్యవహారం బయటపడటంతో వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి, టీఎన్ఎస్ఎఫ్ నేతల సిఫారసు మేరకే రిజిస్ట్రార్ ఇలా అడ్డగోలుగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఏయూ డిగ్రీ పేపర్ లీక్ విషయంలోనూ, పేపర్ రీవాల్యుయేషన్ వ్యవహారాల్లోనూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుపై లెక్కకు మించిన ఆరోపణలున్నాయి. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ మళ్లీ నిర్వహించిన రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మళ్ళీ పరీక్షకు రిజిస్ట్రార్ సిఫారసు
ఈ మేరకు వెంకటేష్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 310126510030 నెంబరుతో అధికారులు హాల్ టికెట్ జారీ చేశారు. అయితే గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన జరిగిన పరీక్షకు అతను హాజరుకాలేదు. కానీ అదే నెల మూడో తేదీన అతను ఏయూకు వచ్చి ఒకటో తేదీనాటి పరీక్షకు హాజరుకాలేకపోయిన తనకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావును కలిసి లిఖిత పూర్వకంగా కోరాడు. తన గైర్హాజరీకి సరైన కారణం కూడా చూపలేదు. ప్రత్యేకంగా పరీక్ష పెట్టడం కుదరదని,, తదుపరి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాల్సిన రిజిస్ట్రార్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ లేఖపై సంతకం పెట్టడంతో పాటు.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని పరీక్షల కంట్రోలర్‌కు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు.
చాలా పెద్ద తప్పు..విచారణకు ఆదేశించా
జీఎస్ఎస్ వెంకటేష్ అనే అభ్యర్ధి కోసం నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష పెట్టారన్న విషయం నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. అది చాలా పెద్ద తప్పు. ఓ రకంగా నేరం. వెంటనే ఫలితాలను నిలుపుదల చేయించాను. ఎవరి సిఫారసుతో పరీక్ష పెట్టారనేది నేను అప్పుడే చెప్పలేను. అసలు ఈ విషయం బహిర్గతమైతే వర్సిటీ పరువుకు భంగమే.. వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాను. – నాగేశ్వరరావు, ఏయూ వీసీ