ప్రజలతో మమేకం కావాలి
సిద్దిపేట అర్బన్: పోలీసులు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలని, అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవభావం పెరుగుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో అధునాతన వసతులతో రూ. 2.20 కోట్ల నిధులతో నిర్మించిన వన్‌టౌన్ మోడల్ పోలీస్‌స్టేషన్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ, మంత్రి హరీష్‌రావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, రాష్ట్రం లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజలతో మర్యాదగా మాట్లాడి ఫ్రెండ్లీగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం కూడా పోలీస్ స్టేషన్ల నిర్వాహణ కోసం అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లకు ఠమొదటిపేజీ తరువాయి
నెలకు రూ. 50 వేలు, రూరల్ పరిధిలో రూ. 25వేలు కేటాయించిందన్నారు. శాంతి ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారన్నారు. అందుకోసం రూ.360 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు.
డీజీపీ అనురాగ్‌శర్మ పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చేలా పని చేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో తొలి బెటాలియన్‌ను సిద్దిపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసేందుకు హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ల నిర్వహణకోసం రూ. 4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో రూరల్ పోలీస్ స్టేషన్‌కు రూ. 50 లక్షలు, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు రూ. 45 లక్షలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం కోసం రూ. 2.22 లక్షలు, నాలుగు ఆర్ఐ క్వార్టర్ల నిర్మాణం కోసం రూ. 80 లక్షలు వినియోగిస్తారని చెప్పారు.
అటెండర్‌ను చైర్మన్ చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదే
టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానిని, అటెండర్‌గా పని చేసే తనను మండలి చైర్మన్‌ను చేసిన ఘనత ప్రజాస్వామ్యానికే దక్కిందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సిద్దిపేటను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రాంతానికి సీఎం వాటర్ గ్రిడ్‌ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. స్టేషన్లు నిర్మించగానే సరిపోదని వాటిని కాపాడుకోవాలని, ప్రజలతో కలిసి మెలిసి వ్యవహరించాలని సూచించారు. సాలార్జంగ్ మ్యూజియం, శిల్పారామం, బిర్లా టెంపల్, చార్మినార్, గొల్కోండ కోటలను చూసేందుకు ఇపుడు అందరూ హైదరాబాద్‌కు ఎలా వెళతారో రానున్న రోజుల్లో సిద్దిపేటను మంత్రి హరీష్‌రావు ఎలా అభివృద్ధి చేశాడో.. ఎలా ఉంటుందో.. అని చూసేందుకు ఇక్కడి వస్తారన్నారు.
హరీష్‌రావు కృషితో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో వాటర్ గ్రిడ్ పథకం, అదే విధంగా రోడ్ల వెంట చెట్లు, బటర్‌ఫ్లై వీధి లైట్లు, మోడల్‌గా పోలీస్ స్టేషన్, క్రైమ్ రేట్‌ను తగ్గించేందుకు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోందన్నారు.
అన్ని భవనాలను ఆధునీకరిస్తాం
సిద్దిపేటలో ఇప్పటికే కోర్టు, ఆర్డీఓ కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిధిగృహం, ఫైర్ స్టేషన్, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు పూర్తయ్యాయని, త్వరలోనే అన్ని కార్యాలయాలను ఆధునీకరిస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న సబ్ జైల్లో వసతులు లేవని ఇరుకుగా మారిందని దీని స్థానంలో మరో జైలును మంజూరు చేయాలని హోంమంత్రిని కోరారు. సిద్దిపేటకు డీఎస్పీ భవనం, జిల్లా పోలీస్ కేంద్రం, టూటౌన్ మోడల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ స్టేషన్, పోలీస్ బెటాలియన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలో పట్టణంలో నేరాల అదుపునకు 128 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వాటిని 24 గంటలు వన్‌టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్లో పరిశీలిస్తారని చెప్పారు.
సిద్దిపేట లౌకిక పట్టణం
అనంతరం డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐజీ నవీన్ చంద్ మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో అన్ని విభాగాలను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే లౌకిక పట్టణంగా సిద్దిపేటకు మంచి పేరుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌లు పార్టీలకతీతంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అధునాతన వసతులతో నిర్మించిన వన్‌టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్లాగానే.. పోలీస్ విధులు కూడా మోడల్‌గానే ఉంటాయన్నారు.
ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ మాట్లాడుతూ, కేజీ నుంచి పీజీ వరకు సిద్దిపేట పట్టణ కేంద్రంగా విద్యావకాశాలు కల్పించి ఉద్యమ గడ్డ సిద్దిపేట పేరు నిలబెట్టాలని మంత్రి హరీష్‌రావును కోరారు. కార్యక్రమంలో జేసీ శరత్, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, వైస్ చైర్మన్ సారయ్య, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, ఎంపీపీలు యాదయ్య, శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ప్రసన్నకుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.