వన్-వే సౌండ్ మెషిన్..!
వాషింగ్టన్: ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణించేలా చేసే వినూత్న సౌండ్ మెషిన్ ఇది. పేరు ‘అకౌస్టిక్ సర్క్యులేటర్’. సాధారణంగా ధ్వని, ఇతర తరంగాలు ముందుకు, అదే మార్గంలో వెనకకు రెండు దిశల్లో కూడా ప్రయాణిస్తుంటాయి. అయితే ఈ మెషిన్ ధ్వని తరంగాలను ప్రత్యేక ఫ్యాన్ సాయంతో తిప్పుతూ విడుదల చేస్తుంది. దీంతో దీని ద్వారా వెలువడే ధ్వని తరంగాలు తిరిగి వెనక్కి రాలేవు.
ఉదాహరణకు.. ఓ గొట్టం ద్వారా ఈ ధ్వని తరంగాలను పంపించామనుకోండి.. ఆ గొట్టం చివర ఉన్న వ్యక్తి మాత్రమే ఈ తరంగాలను వింటాడు. అక్కడి నుంచి ఇవతలికి ఎలాంటి శబ్దమూ తిరిగి రాదు. అలాగే ఈ శబ్దాన్ని అతడి నుంచి మరో దిశగా కూడా పంపించవచ్చు కానీ.. అతడికి కూడా తిరిగి ఆ దిశలో ఎలాంటి శబ్దాలూ వినపడవన్నమాట. అధునాతన గూఢచర్య పరికరాల తయారీకి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని దీనిని తయారు చేసిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.