ఇద్దరు ఎంపీడీఓల సస్పెన్షన్
ఒంగోలు: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎంపీడీవోలను సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ అధికారి టి.బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గుడ్లూరు మండల పరిషత్ అధికారి వసంతరావు నాయక్, గిద్దలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్లను సస్పెండ్ చేయాలనే కలెక్టర్ ఆదేశానుసారం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. గుడ్లూరు ఎంపీడీవో వసంతరావు నాయక్ గతంలో పుల్లల చెరువు మండలం ఈవోఆర్డీగా పనిచేశారు. ఆ సమయంలో కొమరోలుకు చెందిన రూ.6.85 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా పంచాయతీ అధికారి నిధుల దుర్వినియోగం నిజమేనని స్పష్టం చేయడంతో వసంతరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గిద్దలూరు ఎంపీడీవో రాజశేఖర్ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సుజాతశర్మ ఆగ్రహించింది. అయినా జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనను సస్పెండ్ చేశారు.